Maoist Party : ప్రొఫెసర్ సాయిబాబా మరణంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

by Ramesh N |   ( Updated:2024-10-15 11:25:23.0  )
Maoist Party : ప్రొఫెసర్ సాయిబాబా మరణంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పౌర హక్కుల నేత, రచయిత, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయిబాబా నెలకొల్పిన ఆశయాలను, ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులు తన వారసులుగా కొనసాగించాలని కోరారు. పౌర హక్కులను పరి రక్షించడానికి ప్రజల తరఫున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసిందని ఆరోపించారు. ఆయన ఢిల్లీ ప్రొఫెసర్‌గా కొనసాగుతూ మలి దశ తెలంగాణ ఉద్యమానికి మార్గ నిర్దేశం చేశారని1997లో వరంగల్ డిక్లరేషన్‌ సదస్సుకు సాయిబాబా నాయకత్వం వహించారని గుర్తుచేసుకున్నారు.

ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై పోరాడారని తెలిపారు. ప్రశ్నించే శుక్తులను తయారు చేయడం నేరంగా భావించిన రాజ్యం కుట్ర పూరితంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెగాసెస్ వంటి మాల్వేర్స్ సాఫ్ట్ వేర్ల ద్వారా జీఎన్ సాయిబాబా కంప్యూటర్‌లో చొరబడి అందులో మావోయిస్టు సాహిత్యాన్ని చొప్పించి మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని నిందారోపణ చేసి రాజ్యాంగ విరుద్ద చట్టాలను అక్రమంగా మోపారని పేర్కొన్నారు. నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతో కదలేని స్థితిలో ఉన్న కూడా సాయిబాబాను అన్యాయంగా పదేళ్లు ఒంటరి అండా సెల్‌లో నిర్భందించారని తెలిపారు.

తీవ్రమైన అనారోగ్యంతో, బాధ పడుతున్నప్పటికీ ఆ తీర్పును సవాల్ చేస్తూ హిందుత్వ శక్తులు ఎన్ఐఏ తన విడుదలను అడ్డుకుందన్నారు. జైల్లో దుర్భర పరిస్థితులను కల్పించి తన ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశారని ఆరోపించారు. ఆయన మరణానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. ఆయనను మానసిక చిత్రహింసలు పెట్టినప్పటికీ తాను ఏనాడు రాజీ పడలేదని, జైలులో ఖైదీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడారని తెలిపారు. అత్యంత ధైర్యశాలి మొక్కవోని ధైర్యంతో రాజ్యాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక వాదికి, బుద్ధి జీవికి, అంగవైకల్యాన్ని లెక్క చేయని నిస్వార్ధంగా నిలబడిన ప్రజల పక్షపాతికి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నదని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story