హైదరాబాద్‌‌లో రైన్ విత్ రేసింగ్..

by Nagaya |   ( Updated:2022-12-15 06:52:52.0  )
హైదరాబాద్‌‌లో రైన్ విత్ రేసింగ్..
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాండూస్​ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతం కాగా రాత్రి నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో ముసురు పడుతున్నది. దీంతో, శనివారం రాత్రి మొదలైన వర్షం ఆదివారం కూడా పలు చోట్ల కురుస్తోంది. దీంతో, భాగ్యనగరం తడిసి ముద్దయ్యింది. ఉదయం నుంచి ట్యాంక్​ బండ్,​ లిబర్టీ, హిమాయత్​నగర్, నారాయణ గూడ, బషీర్​బాగ్, లక్డీకపూల్, నాంపల్లి, బేగంబజార్, కోఠి, సుల్తాన్​ బజార్​తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుశాయి. కాగా, చలికాలంలో ఈ విధంగా వర్షం కురుస్తుండటంతో ప్రజలంతా చలికి వణికిపోతుకున్నారు. మరోవైపు, పనుల నిమిత్తం బయటకు వెళ్లినవారు వర్షంలో తడుస్తున్నారు.

రైన్ విత్ రేసింగ్..

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన రయ్‌.. రయ్‌... అంటూ ఫార్ములా రేసింగ్‌ కార్లు సందడి చేస్తున్నాయి. ఆదివారం ఓ వైపు వర్షం కురుస్తున్నా కూడా రేసింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వర్షంతో తడిసిన రోడ్లపై రేసింగ్ జరుగుతున్న వీడియోలను ప్రేక్షకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా, దేశీయంగా ఫార్ములా కార్‌ రేసింగ్‌ పోటీలు మొట్ట మొదటిసారిగా హైదరాబాద్‌‌లో జరుగుతుండటంతో ఈ పోటీల కోసం భాగ్యనగరవాసులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక, శనివారం రేసింగ్ నిర్వహణలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. శనివారం క్వాలిఫైయింగ్ పోటీలు జరపకుండా రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించారు. దీంతో, ఆదివారం ఇండియన్ రేసింగ్ లీగ్ తుది పోటీలు జరుగుతున్నాయి. నేడు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 3 రేసులు జరగనున్నాయి.

Advertisement

Next Story