రేవంత్.. డాంబికాలు ఇకనైనా ఆపు: ఈటల రాజేందర్

by srinivas |   ( Updated:2024-10-16 16:46:56.0  )
రేవంత్.. డాంబికాలు ఇకనైనా ఆపు: ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో వేల చెరువులు మాయమయ్యాయని, ఉన్న చెరువులు కూడా పర్యావరణ సంరక్షణకు విరుద్ధంగా మురికి కూపాలుగా మారాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు చెరువులు డ్రైనేజీ నీళ్లతో దుర్గంధపూరితంగా మారాయని, హైదరాబాద్‌కు ఉన్న పేరు, గొప్పదనం కాపాడాలంటే ఆ చెరువులకు వచ్చే మురికినీళ్లను డైవర్ట్ చేసి మంచినీటి చెరువులుగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. స్ట్రాటజిక్ నాళా డెవలప్మెంట్ ప్రోగ్రాంకి నిధులు ఇవ్వాలని కోరినట్లు ఈటల తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో వేలాదిమంది పేదలకు నోటీసులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చిందని, కానీ ఒక్క మంత్రి కూడా వాటిపై మాట్లాడటం లేదని, ముఖం చాటేస్తున్నారని విమర్శలు చేశారు. ఏదన్నా అంటే ముఖ్యమంత్రిని కలవమంటున్నారని, అది అందరికీ సాధ్యమా? అని ఈటల ప్రశ్నించారు. ఇప్పుడున్న ఓఆర్ఆర్‌కి 40 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారని, కానీ గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతంలో కేవలం 28 కిలోమీటర్ల లోపే రీజినల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారన్నారు. అక్కడి రైతులు ఇప్పటికే ప్రాజెక్టులు, కాలువలు, కరెంట్ లైన్లు, ప్రభుత్వ అవసరాలకు భూములు ఇచ్చి కోల్పోయి ఉన్న కొద్ది భూమితో బతుకుతున్నారన్నారు. తమను భికారీలను చేయొద్దని రైతులు ఉద్యమం చేస్తున్నారని తెలిపారు.

రూ.కోటి విలువ ఉన్న భూమికి రూ.10 లక్షల నష్టపరిహారం మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. మళ్లీ రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో తమను రోడ్డుపై పడేయొద్దని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఈటల వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ను కలిసి డబుల్ బెడ్రూం ఇండ్ల సంఖ్యను భారీగా పెంచాలని కోరినట్లు చెప్పామన్నారు. కేంద్రం, రాష్ట్రప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని ఈటల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వపరంగా తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులన్నీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని గుర్తుచేశారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన వాటా సకాలంలో జమ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతున్నాయని ఈటల పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు జీఎస్ డీపీలో 25 శాతం దాటవద్దనే నిబంధన ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 50 శాతం దాటిందని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారని తమ ఎంపీలను ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీ. హైవేలు, రైల్వే, అర్బన్ హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అని పేర్కొన్నారు.

వాటితోనే రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు కాదని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రజల కోసం ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు అద్దె ఇచ్చేందుకు, వంట సామగ్రి, డైట్ చార్జీలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇది సిగ్గుచేటు అని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డాంబికాలు మాట్లాడటం, బుల్డోజ్ చేసేలా మాట్లాడటం పక్కన పెట్టాలని చురకలంటించారు. దబాయింపులతో, బెదిరింపులతో రాష్ట్రాన్ని నడపలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ డొల్లతనం ఇప్పటికే తేటతెల్లమైందని, మంత్రులు కోప్పడకుండా ప్రజలకు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలని రాజేందర్ సూచించారు. గత ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని విమర్శలు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రేవంత్ కొత్తగా చేసేదేమీ లేదని, కొత్తవాటి ఏర్పాటు ఎలా ఉన్నా ఉన్న స్కూళ్లను మూసివేయకుండా చూడాలని పేర్కొన్నారు. అయినా విద్యార్థుల తిండికే డబ్బులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వారికి బిల్డింగులు ఏం కడుతుందని విమర్శలు చేశారు.

Advertisement

Next Story