నిజ్జర్ కేసులో కెనడా యూటర్న్!

by Mahesh Kanagandla |
నిజ్జర్ కేసులో కెనడా యూటర్న్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి భారత్ ‌పై కెనడా తీవ్ర ఆరోపణలు ఉభయ దేశాల మధ్య దౌత్య సంక్షోభానికి దారితీశాయి. తమ పౌరుడైన నిజ్జర్‌ను తమ దేశంలోనే భారత ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్ సహకారంతో హతమార్చిందని కెనడా పోలీసులు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను కోరుతూ అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అందించామని కెనడా చెబుతూ వచ్చింది. కెనడా ఆరోపణలు అవాస్తవాలని, నిరాధారాలని భారత్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో కెనడా పీఎం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు గమనిస్తే యూటర్న్ తీసుకున్నట్టుగానే ఉన్నది.

నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఫారీన్ ఇంటర్‌ఫెరెన్స్ ఇంక్వైరీ ముందు హాజరైన పీఎం జస్టిన్ ట్రూడో.. తమ వద్ద హార్డ్ ప్రూఫ్ లేదని, కేవలం ఇంటెలిజెన్స్ సమాచారం మాత్రమే ఉన్నదని అంగీకరించారు. నిజ్జర్ హత్యకు సంబంధించి ప్రకటన చేయడానికి ముందు ఇండియాతో కలిసి దర్యాప్తు చేయాలని భావించామని, కానీ, ఇండియా ఆధారాలు అడిగిందని వివరించారు. అప్పుడు తమ వద్ద ఉన్నది ప్రాథమిక స్థాయి ఇంటెలిజెన్స్ మాత్రమేనని, హార్డ్ ప్రూఫ్ లేదని తెలిపారు. కానీ, నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నదని, అందుకు తగిన ఆధారాలు ప్రస్తుతం తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. జస్టిన్ ట్రూడో కామెంట్లు ఆ దేశం చేస్తున్న ఆరోపణలపైనే అనుమానాలను లేవదీస్తున్నాయి.

మేమే సమాచారం ఇచ్చాం

నిషేధిత ఉగ్రసంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపట్వంత్ సింగ్ పన్ను కెనడా టీవీ చానెల్ సీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కెనడా ప్రధానమంత్రి కార్యాలయంతో రెండుమూడేళ్లుగా టచ్‌లో ఉన్నామని చెప్పారు. భారత ఏజెన్సీలు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కోసం లాజిస్టిక్స్, ఇంటెలిజెన్స్ సపోర్ట్ కోసం భారత హైకమిషనర్లు ఏ విధంగా ఒక స్పై నెట్‌వర్క్‌ను తయారు చేశారో కెనడా పీఎంవోకు సిఖ్స్ ఫర్ జస్టిస్ సమాచారాన్ని ఇచ్చిందని తెలిపారు. తమకు కెనడా ప్రభుత్వం నుంచి అచంచల మద్దతు ఉన్నదన్నారు.

నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కోసం భారత హైకమిషనర్‌ను విచారించే అనుమతి ఇవ్వాలని కెనడా కోరిన విషయం ఈ సందర్భంలో గమనార్హం. ఆ తర్వాత దౌత్య సంక్షోభం నెలకొంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు భారత్ పై చేసిన ఆరోపణలు.. ప్రస్తుతం గురుపట్వంత్ సింగ్ పన్ను చెప్పిన వివరాలను పోలి ఉండటం మరిన్ని అనుమానాలకు దారితీస్తున్నాయి.

Advertisement

Next Story