ఆ రెండు స్కీంలకు ఫుల్ డిమాండ్.. ఉదయం నుంచే క్యూ కట్టిన జనం!

by GSrikanth |
ఆ రెండు స్కీంలకు ఫుల్ డిమాండ్.. ఉదయం నుంచే క్యూ కట్టిన జనం!
X

దిశ, తెలంగాణ న్యూస్ నెట్ వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. చాలాచోట్ల ప్రజలు ఉదయం నుంచే కౌంటర్ల వద్ద బారులదీరారు. అయితే ఎక్కువమంది మహిళలు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయంతో పాటు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల దరఖాస్తులను జిరాక్స్, మీ సేవా కేంద్రాల్లో రూ. 20 నుంచి 50వరకు విక్రయించడం.. ఫిలప్ చేయడానికి మరో రూ. 100 తీసుకోవడం కనిపించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించగా జిల్లాలలో మంత్రులు ప్రారంభించారు. ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క, బంజారాహిల్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.

3,714 స్పెషల్ టీమ్స్..

రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. పది శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజాసదస్సులను నిర్వహించనున్నది.

మాది ప్రజా ప్రభుత్వం: భట్టి

గత ప్రభుత్వంలా మా పార్టీలోకి వస్తేనే పథకాలిస్తామని చెప్పబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వమని అందుకే ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలను అమలు చేస్తామన్నారు.

పైరవీలకు నో చాన్స్: పొన్నం

ఆరు గ్యారంటీల అమలులో పైరవీలకు చాన్స్ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ లో 600 కేంద్రాల్లో అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతోందన్నారు.

అరకొర అప్లికేషన్లు..

గ్రేటర్ హైదరాబాద్ లోని 150 మున్సిపల్ డివిజన్లలో ఏర్పాటు చేసిన 600 కౌంటర్లలో ప్రజలు ఉదయం నుంచే ప్రజలు బారులుదీరగా చాలాచోట్ల ప్రారంభించిన మూడు గంటల్లోనే దరఖాస్తులు అయిపోయాయి. తిరిగి రేపు ఉదయం రావాలని సిబ్బంది సూచించడంతో ప్రజలు కొంత అసహనానికి గురయ్యారు. అలాగే నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని పలుచోట్ల దాదాపు అన్ని పార్టీల నేతలు మీకు వచ్చేలా చూస్తాం.. అంటూ బేరసారాలకు దిగినట్టు సమాచారం.

దరఖాస్తు ఫారం రూ. 20- 50..

నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని జిరాక్స్ సెంటర్లు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలను రూ. 20 నుంచి రూ. 50 వరకు విక్రయించారు. కాగా అప్లికేషన్ ను పూరించేందుకు ఆయా కేంద్రాల నిర్వాహకులు ఒక్కో దరఖాస్తుకు దాదాపు రూ. 100 వసూలు చేశారు.

3 గంటలు పట్టింది: విజయదుర్గ, దరఖాస్తుదారు, నాంపల్లి

పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు 3 గంటల టైం పట్టింది. కౌంటర్ల దగ్గర ఎవరూ సరిగ్గా పట్టించుకుంటలేరు. అందుకే లేట్ అయితున్నది. జనాలకు సరిపడా అప్లికేషన్లు లేవు. చానామంది గులుక్కుంట వెళ్లిపోయిన్రు.

Advertisement

Next Story

Most Viewed