స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Kalyani |
స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, తొమ్మిదేళ్ల పాలనను గత పాలనతో బేరీజ్ వేసుకోవాలని బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

మంగళవారం బీఆర్ఎస్ 23 వసంతాల సందర్భంగా జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారని, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు జీవం పోసి, కాలువల్లో నీళ్లు పారించామన్నారు. పంట పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించామని, వ్యవసాయానికి సైతం 24 గంటల విద్యుత్ అందించామన్నారు.

ఎరువులు. విత్తనాలు సమయానికి పంపిణీ చేసి రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మిషన్ భగీరథతో తాగునీరు, ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి సాగునీరు, ప్రతి పేద కుటుంబానికి అభివృద్ధి సంక్షేమం పథకాలు చేరుస్తూ దేశంలోనే ఆదర్శంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఇప్పటికే 130,000 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తి చేసి, మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని తెలిపారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ ఉద్యోగాలు నేడు ఎటుపోయాయని ప్రశ్నించారు. యువతను మభ్యపెడుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన బీజేపీ మీటింగ్ లో అమిత్ షా మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల్లో పంచాయితీలు ఎక్కువ ఉన్నాయని, సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక గొడవ పడుతున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రతి పండుగనూ ప్రశాంతంగా జరుపుకుంటున్నామని, బీఆర్ఎస్ లో ఉన్నందుకు మనమందరం గర్వ పడాలని అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం, ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలని, పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధిపై ఫనిరాజ్ రూపొందించిన డాక్యుమెంటరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అనంతరం చివరగా నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంపై పది తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ వాల్య నాయక్, నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి, మహబూబ్నగర్ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరపల్లి లక్ష్మి, మిడ్జిల్, రాజాపూర్, బాలానగర్, నవాబ్ పేట్, ఊరుకొండ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed