అచ్చంపేట ప్రాంతాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేస్తాం – గువ్వల బాలరాజు

by Kalyani |
అచ్చంపేట ప్రాంతాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేస్తాం – గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట : జిల్లాలోని అచ్చంపేట ప్రాంతాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని ఒక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని మండలాల అధికారులు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేటలో రూ.4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణం చేపడతామని, మార్కెట్ యార్డు ను ప్రజలకు అవసరమయ్యే విధంగా సుందరంగా నిర్మించి మార్కెట్ యార్డు చుట్టూ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

అదేవిధంగా స్మృతి వనాన్ని గొప్పగా తయారు చేస్తామన్నారు.రాష్ట్రంలో 5 వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రులు మంజూరు అయితే అందులో ఒకటి మన అచ్చంపేట కు తీసుకొచ్చమన్నారు. అలాగే ఉమామహేశ్వర ప్రాజెక్టు టెండర్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే సీఎం కేసీఆర్ తో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఓర్వలేక...

అచ్చంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఈనెల 16న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్ రన్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు అచ్చంపేట నియోజకవర్గం నుంచి అన్ని మండల, గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రాంతం వాడు ప్రజలకు ద్రోహం చేస్తే పాతరేయండి, ప్రాంతీయేతరుడు ప్రజలకు సేవ చేస్తే పట్టం కట్టండి అనే నినాదంతో ప్రజలకు పిలుపునిచ్చారు. అదే నినాదంతో ఇక్కడి నాయకుడిని ప్రజలు పాతరేశారని, నేను ఇక్కడి వాడిని కాకపోయినా అచ్చంపేట ప్రజలు నాకు అవకాశం కల్పించినందుకు ఈ ప్రాంతం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు.వచ్చే నెలలో అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గడపగడపకు జిబిఆర్ అనే కార్యక్రమం నిర్వహించి ప్రతిపక్షాల గుండెలు పగిలేలా ప్రజల మధ్యకు వెళ్తామన్నారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ సారథ్యంలో భారతదేశం బంగారు దేశం గా మారుతుందని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పిఎసిఎస్ ఛైర్మెన్లు, పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డివిజన్ మరియు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed