13 నెలలుగా వేతనాలు చెల్లించలేదు.. పెట్రోల్ డబ్బాలతో కార్మికుల ధర్నా..

by Kalyani |   ( Updated:2023-06-06 13:59:43.0  )
13 నెలలుగా వేతనాలు చెల్లించలేదు.. పెట్రోల్ డబ్బాలతో కార్మికుల ధర్నా..
X

దిశ, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం కలుకుట్ల గ్రామంలోని నది బయో ప్రొడక్ట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు 13 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ డబ్బాలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. కంపెనీలో సుమారు 200 మంది పనిచేస్తున్నామని, 13 నెలలు దాటిన ఇంతవరకు ఒక్క పైసా జీతం ఇవ్వలేదని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలలో కంపెనీ బంద్ చేసి వెళ్లారని, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ గా వస్తుందని వాపోయారు.

మాకు రావాల్సిన జీతం ఎవరిని అడగాలో తెలియడం లేదన్నారు. గత ఏప్రిల్ నెలలో కంపెనీ ఎదుట నిరసన తెలుపగా కంపెనీ యాజమాన్యం రెండు మూడు నెలల్లో వేతనాలు చెల్లిస్తామని గ్రామ సర్పంచ్ ఆత్మ లింగారెడ్డి ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చారన్నారు. ఇచ్చిన గడువు పూర్తయిన ఇప్పటివరకు వాళ్ళు మాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. వేతనాలు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed