అభ్యర్థులు చేసే ఖర్చులను జాగ్రత్తగా నమోదు చేయాలి

by Disha Web Desk 11 |
అభ్యర్థులు చేసే ఖర్చులను జాగ్రత్తగా నమోదు చేయాలి
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు చేసే ఖర్చులను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని నాగర్ కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ అధికారులకు ఆదేశించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల వ్యయ పరిశీలకులు గా నియమితులైన సౌరభ్ శుక్రవారం జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ… అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చులను ఏ విధంగా లెక్కిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల నిర్వహణలో అన్ని టీంలు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని, అనుమానస్పద ఖాతాలను చెక్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, ఎస్ ఎస్ సి అకౌంటింగ్ టీం సభ్యులు సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రచారానికి పార్టీ ద్వారా అభ్యర్థి తరపున ఖర్చుచేసే ప్రతి పైసాను పకడ్బందీగా ఎన్నికల వ్యయం కింద జమ చూపెట్టాలని ఆదేశించారు. అనంతరం సి.విజిల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ సెంటర్, గ్రీవెన్స్ కమిటీ సెంటర్, మీడియా సెంటర్ లను వ్యయ పరిశీలకులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్వాడ్‌, ఎస్‌ఎస్‌టీ బృందాలను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చెసిన స్క్రీన్లు పర్యవేక్షించారు. ఎం సి ఎం సి ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయాలన్నారు. ఎంసిఎంసి కమిటీ ద్వారా రోజువారి దినపత్రికలలో వచ్చే పెయిడ్ న్యూస్ పై దృష్టి సారించాలని సోషల్ మీడియా పై పటిష్టంగా నిఘా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు , ఆర్.డి.ఓ రామ్ చందర్, అదనపు ఎస్పీ గుణశేఖర్, అన్ని టీంల నోడల్ అధికారులు, ఎం.సి.ఎం.సి టీం, అకౌంటింగ్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story