ఆ గ్రామానికి బస్సు నడపాలని విద్యార్థులు, గ్రామస్తులు రాస్తారోకో

by Aamani |
ఆ  గ్రామానికి బస్సు నడపాలని విద్యార్థులు, గ్రామస్తులు రాస్తారోకో
X

దిశ,వీపనగండ్ల: మండలంలోని బొల్లారం కొర్లకుంట గ్రామాల మీదుగా వనపర్తి కొల్లాపూర్ పట్టణాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను యధావిధిగా నడిపించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బొల్లారం కొర్లకుంట గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రజలు కొర్లకుంట క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. కరోనా ముందు తమ గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సులు తిరిగేవని కరోనా కారణంగా ఆ బస్సులను రద్దు చేసి నేటికీ పునరుద్ధరించలేదని, పలుమార్లు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్టీసీ అధికారుల కు తమ గ్రామాల మీదుగా బస్సులు నడపాలని వినతి పత్రాలు అందించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.

బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాలలకు కళాశాలలకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకున్నప్పటికీ చేసేది లేక తమ ఇబ్బందులను తెలపటానికి రాస్తారోకో నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తమ గ్రామాల మీదుగా వనపర్తి కొల్లాపూర్ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించకపోతే ఆర్టీసీ డిపోల ఎదుట రెండు గ్రామాల ప్రజలతో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. విషయాన్ని తెలుసుకున్న కొల్లాపూర్ ఆర్టీసీ అధికారులు రాస్తారోకో వద్దకు చేరుకొని వారం రోజుల్లో కొర్లకుంట బొల్లారం గ్రామాల మీదుగా బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగిరెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు మండ్ల కృష్ణయ్య , డివైఎఫ్ఐ నాయకులు నాగరాజు, కొర్లకుంట మాజీ సర్పంచ్ నారాయణ, విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed