రాష్ట్ర మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతుండ్రు: జి.మధుసూధన్ రెడ్డి

by Kalyani |
రాష్ట్ర మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతుండ్రు: జి.మధుసూధన్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్ర టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తానని ప్రగల్బాలు, అసంధర్భ ప్రేలాపనలు పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోయి తప్పి మాట్లాడారని, రేవంత్ రెడ్డిని తాక లేవని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జి.మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము మంత్రులమన్న ఇంగిత జ్ఞానం లేకుండా, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రేవంత్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నట్లు సభ నిర్వహించారని, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రసంగాల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన తమ్ముడు చేసిన, చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడితే గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని ఆయన ఎద్ధేవా చేశారు. మీ ప్రసంగాలు విని థర్డు క్లాస్ గాళ్ళు ఎవరో ప్రజలు గుర్తించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాబోయే రోజుల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన తమ్ముని అక్రమాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని, రాబోయే ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు డిపాజిట్ రాకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. అబద్ధాలు మాట్లాడడంలో కేటీఆర్ తండ్రిని మించిన తనయుడుగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దోచుకొని దాచుకుంటూ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నీళ్ళ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావని, మైక్ ఉంది కదా అని మతి స్థిమితం లేని మాటలు మాట్లాడారని ఆయన మండి పడ్డారు. దివిటిపల్లిలో ఐటి కారిడార్ అని ప్రగల్బాలు పలికి, పర్యావరణానికి హాని కలిగించే, ఎనిమిది రాష్ట్రాలు తిరస్కరించిన అమర్ రాజా బ్యాటరీ సంస్థను నెలకొల్పడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ టవర్ అని చెప్పి ఒక్క ఐటి కంపెనీను తీసుకరాకపోవడం సిగ్గు చేటని ఆరోపించారు.

మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసి ఉంటే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేసి సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అవినీతి బీఆర్ఎస్ ను ఆమడ దూరంలో పారదోలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీపిసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్, మహిళా కమిటి అధ్యక్షురాలు వసంత, జహీర్ అక్తర్, సాయిబాబా, రాములు యాదవ్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed