Nag Ashwin: ‘కల్కి’ కథ నచ్చడం వల్లే స్టార్ హీరోలు నటించారు: డైరెక్టర్ నాగ్ అశ్విన్

by Shiva |   ( Updated:2024-07-23 17:04:12.0  )
Nag Ashwin: ‘కల్కి’ కథ నచ్చడం వల్లే స్టార్ హీరోలు నటించారు: డైరెక్టర్ నాగ్ అశ్విన్
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ‘కల్కి’ సినిమా కథలో ఉన్న దమ్ము వల్లే స్టార్ హీరోలు, ఇతర నటీనటులు నటించేందుకు ముందుకొచ్చారని మూవీ డైరెక్టర్ దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ఆయన తల్లిదండ్రులు జయంతి, జయరాం వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కల్కి సినిమా ప్రదర్శించబడుతున్న ఏవీడీ థియేటర్‌ను నాగ్‌ అశ్విన్ సందర్శించారు. అంతకు ముందు ఎస్వీఎస్ ఆసుపత్రిలో నిర్వాహకులు రామిరెడ్డి, థియేటర్‌ యజమాని గుద్దేటి శివకుమార్ నాగ్‌కు బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సినిమాకు వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కథలో కొత్తదనం, దమ్ము ఉండడం వల్లే స్టార్ హీరోలు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారు నటించారని గుర్తు చేశారు. సినిమా విజయం తనలో ఓ పట్టుదలను తెచ్చిందన్నారు. సెకండ్ పార్ట్‌ను కూడా మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సినిమా విజయం సాధించడంలో అందరి పాత్ర ఉందని అన్నారు.

తనది నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామమని.. ఎస్వీఎస్ ఆసుపత్రి నిర్మాణం అవుతోన్న టైంలో మహబూబ్‌నగర్‌కు వచ్చే వాడినని గుర్తు చేశారు. అమ్మ, నాన్నలు ఇక్కడే వైద్యులుగా పని చేస్తూ ఉండడం, తన చెల్లి కూడా ఇక్కడే ఎంబీబీఎస్ చదువుతూ ఉండడంతో ఎక్కువ సార్లు మహబూబ్‌నగర్‌తో అనుబంధం ఏర్పడిందని అన్నారు. తాను ఎక్కడున్నా.. పాలమూరును మరిచే ప్రసక్తే లేదని అన్నారు. అనంతరం నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు జయరాం, జయంతి మాట్లాడుతూ.. తమ అబ్బాయికి మొదటి నుంచి మీడియా పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఆ రంగంలో ఇంత గొప్ప స్థాయికి చేరుకుంటాడని అనుకున్నాం కానీ.. ఇంత పెద్ద సినిమా తీసి పెరు సంపాదిస్తాడని ఊహించలేదని అన్నారు. తల్లిదండ్రులుగా ఇంతకన్నా తమకు ఆనందం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పండగలకు సొంతూరు ఐతోలుకు తప్పకుండా వెళ్లి వస్తామని తెలిపారు.

ఆకట్టుకున్న బుజ్జి..

‘కల్కి’ సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన కారు ‘బుజ్జి’ పాలమూరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుటోంది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వాహనాన్ని మూవీ యూనిట్ ప్రదర్శనకు ఉంచారు. అయితే, విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు బుజ్జిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కొందరు ఆ వాహనంతో సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు.

Advertisement

Next Story