పాత తరమా..!? యువతరమా..!?

by S Gopi |   ( Updated:2023-03-24 04:44:46.0  )
పాత తరమా..!? యువతరమా..!?
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ప్రకటించగా... గెలుపు గుర్రాలను రంగంలో దించుతామని బీజేపీ స్పష్టం చేసిన నేపథ్యంలో 40 శాతం సీట్లు యువతరానికి కేటాయిస్తామని ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన యువ నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో దాదాపు ఐదు సీట్లకు పైగా యువ నాయకులకు దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. పలు నియోజకవర్గాల్లో యువ నాయకులు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదీ ఏమైనా రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ సీనియర్ నేతలకు మింగుడు పడనప్పటికీ యువ నేతల్లో మాత్రం ఉత్తేజాన్ని నింపిందని చెప్పవచ్చు.

13 నియోజకవర్గాల్లో...

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనతో కొన్నిచోట్ల సీనియర్ల కన్నా ఎక్కువగానే జూనియర్లు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జగదీశ్వరరావు, అభిలాషరావు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అభిలాష రావు యువకుడు అయినప్పటికిని తనదైన స్టైల్ లో కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూనే అడుగులు ముందుకు వేస్తున్నారు.. మరోవైపు అధికార పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లగలుగుతున్నారు. ఈ కారణంగానే అభిలాష్ రావుకు పీసీసీ కార్యదర్శిగా అవకాశం లభించింది. పలు నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి అధిష్టానం ఇచ్చే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్, కార్యదర్శి అనిరుథ్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అనిరుథ్ రెడ్డి ఒకవైపు నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతూనే రాష్ట్రస్థాయిలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడిగా ముద్రపడిన అనిరుథ్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా కొనసాగిన జిల్లెల్ల చిన్నారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఇప్పటి నుంచే తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, శివసేన రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ నాకే వస్తుంది అన్న ధీమాతో చిన్నారెడ్డి ఉండగా, యువజన కాంగ్రెస్ కోటా కింద తప్పనిసరిగా టికెట్ తనకే వస్తుంది అని శివసేన రెడ్డి ఘంటా పథంగా చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా యువతరానికి ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తే చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్య రెడ్డిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు సైతం పనిచేస్తుండడంతో పార్టీ పరిస్థితులు ఈ నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఏ మేరకు రాణించగలుగుతారు అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. నాగం పోటీ చేయలేని పరిస్థితులు ఉంటే ఆయన కుమారుడు శశిధర్ రెడ్డిని రంగంలోకి దించవచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. తండ్రి ప్రతి ఎన్నికలలో చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన శశిధర్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో టికెట్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నారాయణపేట నియోజకవర్గంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పోటీ చేస్తారు అని చెబుతున్నప్పటికిని ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళ నాయకురాలు పెట్టిన కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న శివకుమార్ రెడ్డి స్థానంలో అతని మేనల్లుడు చిట్టెం అభిజయ్ రెడ్డిని రంగంలోకి దించవచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, మరో రాష్ట్ర నేత ప్రశాంత్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడమే తమ లక్ష్యంగా అన్నట్లుగా ఉన్నారు. ఇరువురు యువ నాయకులే కావడంతో టికెట్ ఇద్దరిలో ఒకరికి దక్కుతుందని అంటున్నారు. కానీ మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు పార్టీలో చేరి టికెట్ ఆశించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 13 సీట్లలో ఐదు సీట్లకు పైగా యువ నాయకులకు దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి: సీఎం ప్రక‌ట‌నతో పంట న‌ష్టంపై స‌ర్వే షురూ

Advertisement

Next Story

Most Viewed