ఈనెల 23న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక

by Sridhar Babu |
ఈనెల 23న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : డీసీసీబీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ఈనెల 23న నిర్వహించేలా సంబంధిత అధికారులు ఆదివారం షెడ్యూలును విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారి, సహకార శాఖ డిప్యూటీ రిజిస్టర్ టైటస్ పాల్ షెడ్యూలును విడుదల చేశారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకొని చైర్మన్ పదవిని దక్కించుకున్న విషయం పాఠకులకు విధితమే. చైర్మన్గా ముక్తల్ నియోజకవర్గానికి చెందిన చిట్యాల నిజాం పాషా ఎంపికై దాదాపుగా మూడు సంవత్సరాలకు పైగా పదవిలో కొనసాగారు.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురైన నిజాం పాషా కోలుకోకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ ఎంపిక ప్రక్రియ అనివార్యం అయింది. నూతన చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికల నిర్వహణ అధికారులు షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం ఈనెల 23వ తేదీన జరగనుంది. ఈనెల 23న ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు డీసీసీబీ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు.

11 గంటల నుండి 11:30 గంటల మధ్య దాఖలైన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి రెండు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఎన్నిక ఏకగ్రీవం కాకుంటే సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

Advertisement

Next Story