మే 7న సామూహిక వివాహాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Shiva |
మే 7న సామూహిక వివాహాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: తెలంగాణ తిరుపతి మన్యంకొండ ఆలయ ప్రాంగణంలో 7న భారీ ఎత్తున సామూహిక వివాహాలు నిర్వహిస్తామని ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడమంటే తల్లిదండ్రులకు భారంగా ఉండేదన్నారు. ఈ పరిస్థితిని దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని తెలిపారు.

నిరుపేదలకు సహాయమందించాలనే ఉద్దేశంతో శ్రీ శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను నిర్వహించనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. అర్హులైన యువతీ, యువకులు మన్యంకొండ ఈవో కార్యాలయంలో లేదా తమ క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 15లోపు పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇందుకు గ్రామ కార్యదర్శి, సర్పంచ్ తో ధృవీకరణ పత్రం దరఖాస్తుకు జత చేయవలసి ఉంటుందన్నారు. వధువులు అనాథలైతే.. అవసరమైతే తామే కన్యాదానం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మన్యంకొండను సుందరంగా తీర్చిదిద్దుతాం

తెలంగాణ తిరుపతి మన్యంకొండను సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద రోప్ వేను మన్యంకొండలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అందుకు టెండర్లను కూడా ఆహ్వనించామని తెలిపారు. మన్యంకొండపై 18 గదులతో కూడిన వసతి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేశామని, మరో 20 గదుల వసతి గృహాలను నిర్మించేందుకు త్వరలోనే ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు.

అదేవిధంగా రూ.25 కోట్లతో అన్నదాన సత్రం, రూ.5 కోట్లతో ప్రసాదం కౌంటర్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, మూడా డైరెక్టర్ ఆంజనేయులు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్టు కన్వీనర్లు సుబ్బయ్య, లోకయ్య, వేణుగోపాల్, మన్యంకొండ ఆలయ కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story