టీచర్ల అడ్డా ..ఊట్కూరు గడ్డ.. ఉపాధ్యాయుల ఎంపికలో ప్రతిసారీ రికార్డు

by Aamani |
టీచర్ల అడ్డా ..ఊట్కూరు గడ్డ.. ఉపాధ్యాయుల ఎంపికలో ప్రతిసారీ రికార్డు
X

దిశ,ఊట్కూరు: ఊట్కూరు.. ఊట్కూరు.. ఇది నారాయణపేట జిల్లాలో ఉన్న ఒక మారుమూల మండలం. ఈ మండలము పేరు చెబితే.. అందరికీ ఒక వెనుకబడిన, మత ఘర్షణలు చెలరేగి మండలంగా కండ్ల ముందు ముందు కదలాడుతుంది.. ఒకరకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెనుకబడిన మండలాలలో.. ఈ మండలం పేరు కూడా ఉంటుంది. కానీ, కొందరికే తెలిసిన ఓ ఘనతను ఊట్కూరు మండలం సాధించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులలో అత్యధికులు ఈ మండలం వారు కావడం విశేషం.

రజాకార్ల పాలన సమయంలో ఆర్య సమాజం ఏర్పాటు కావడం.. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి చిన్నపాటి పాఠశాలను ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రాంతం వారికి కలిసి వచ్చింది. ఆర్య సమాజం ఆధ్వర్యంలో కొనసాగిన పాఠశాలలో చదివిన.. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివిన అందరి లక్ష్యం ఒకటే.. కష్టపడి చదివి ఎలాగైనా టీచర్ ఉద్యోగాలు సాధించాలన్న తపన. ఆ కారణంగానే ఊట్కూరు మండలం లో విద్యావంతులు అంతా తమ దృష్టిని ఎక్కువగా ఉపాధ్యాయ పోస్టుల వైపే సారించి.. అందుకు అనుగుణంగా శ్రమించి ప్రతి డీఎస్సీలో రికార్డు స్థాయిలో ఉపాధ్యాయులుగా ఎంపిక అవుతున్నారు.

175 మందికి పైగా ఉపాధ్యాయులు..

ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన వారు ఏకంగా 175 మందికి పైగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పాఠశాలల్లో విధులను నిర్వహిస్తుండగా..మండలానికి చెందిన మరికొంతమంది కలిపి మొత్తం 200 మందికి పైగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన డీఎస్సీలో మండల కేంద్రానికి చెందిన వారు ఆరుగురు ఉపాధ్యాయులు గా ఎంపికయ్యారు. మండలంలో మరికొంతమంది యువకులు ఉపాధ్యాయులుగా ఎంపిక విధులు నిర్వహిస్తున్నారు.

ఆత్మీయ సమ్మేళనాలు..

ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన విద్యావంతులలో 90 శాతం మంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతుంటే.. మిగిలిన 10 శాతం మాత్రమే వివిధ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ఒకరిని చూసి మరొకరు.. ఎలాగైనా ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలన్నా లక్ష్యంతో.. కసిగా చదువుతున్నారు.. ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. ఇలా ఎంపికైన ఉపాధ్యాయులు అందరూ సెలవు రోజుల్లో తమ సొంత ఊరికి వచ్చి ఆత్మీయ సమ్మేళనాలు , సమావేశాలు నిర్వహించడం తో పాటు తమ గ్రామంలో ఉన్న పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల విశ్రాంతి పొందిన ఉపాధ్యాయులు అంతా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అందరిలో ఆనందాన్ని మిగిల్చింది. మొత్తం పై ఊట్కూరు మండల కేంద్రమే కాదు.. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారంతా ఉపాధ్యాయులుగా ఎంపిక అవుతుండడం చర్చనీయాంశం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed