ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ- తీవ్రత తక్కువ: మంత్రి హరీష్ రావు

by Disha News Desk |   ( Updated:2022-01-18 10:23:09.0  )
ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ- తీవ్రత తక్కువ: మంత్రి హరీష్ రావు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రానున్న మూడు నాలుగు వారాల్లో కరోనా వైరస్ మరింత విజృంభించే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్, కోయిల్ కొండ మండల కేంద్రాల్లో నూతన ఆస్పత్రుల భవనాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో రెండు దఫాలుగా వచ్చిన వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికిని తీవ్రత మాత్రం తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రానున్న మూడు నాలుగు వారాలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం తో పాటు, వ్యాక్సిన్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని సూచించారు.

ఇప్పటికే మొదటి డోసు వంద శాతం పూర్తయిందని, రెండవ డోసు 70 శాతం దాటిందన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ ఇప్పించాలని అన్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్ లతోపాటు, సర్పంచులు, ఎంపీటీసీలు కీలక పాత్ర పోషించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన ఎదుర్కోడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story