ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

by Naveena |
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సేంద్రియ ఎరువులు వాడి ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభదాయకమని,రైతులు ఎవరిపై ఆధారపడాల్సిన పని లేదని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లాలో గురువారం మొదలైన 'రైతు పండుగ' కార్యక్రమంలోని సదస్సులో ఆయన హాజరై ప్రసంగించారు. సేంద్రియ ఎరువులు వాడకం వల్ల రైతుల్లో తక్కువ దిగుబడి వస్తుందనే భ్రమలో ఉన్నారని,సేంద్రియ ఎరువుల వాడకం వల్లనే అధిక దిగుబడి వస్తుందని,తాను గత 50 ఏళ్ల వ్యవసాయ అనుభవంతో చెబుతున్నానని ఆయన అన్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన పంటకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని,తాను పండిస్తున్న వరి ధాన్యం కిలో 150 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా విటమిన్ ఎ, బి12 వంటి విటమిన్లను జోడించి పంటను సాగు చేయవచ్చని,మట్టితో మట్టి పురుగు మందు తయారు చేయవచ్చని,ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా చేయాలో రైతులకు సదస్సు పెట్టి వివరంగా వివరిస్తానని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా మహిళా రైతు లావణ్య రమణారెడ్డి మాట్లాడుతూ..తాము ముందుగా రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేసేవారమని,పెట్టుబడి పోను కేవలం 11 రూపాయలు మిగిలేదన్నారు. రసాయన ఎరువులను నమ్మి ఉన్న10 ఎకరాల భూమి అమ్ముకున్నామని,తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించి,దాదాపు 30 రకాల పంటలను సాగు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సేంద్రియ పంటను స్వయంగా మార్కెటింగ్ చేసి అమ్ముకుని లాభం పొందుతున్నామని,ఇప్పుడు 30 ఆవులు,అమ్మిన 10 ఎకరాల పొలాన్ని తిరిగి కొనుగోలు చేసి,లాభసాటి వ్యవసాయం చేస్తున్నట్లు రైతులకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed