తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రం సుసంపన్నమయ్యింది.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Sumithra |   ( Updated:2023-06-02 13:43:13.0  )
తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రం సుసంపన్నమయ్యింది.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ : తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా అధికారుల సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రసంగించారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని, ధాన్యం కొనుగోలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. రైతుబంధు, రైతు భీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పింఛన్లు లాంటి అనేక సంక్షేమ పథకాలే కాకుండా, జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు లాంటి ఎన్నింటినో తెలంగాణ ఆచరిస్తున్నది చూసి, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకున్నదని అన్నారు.

ఒకప్పుడు కరువు జిల్లా, వలసల జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు పచ్చని పంటలకు నిలయంగా ఉందని, పాలమూరులో దొరికే వ్యవసాయ, ఉపాది పనుల కోసం, ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు పాలమూరుకు వలస వస్తున్నారంటే జిల్లా సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవాలని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, సంక్షేమం తదితర అన్ని రంగాలలో జిల్లా గడచిన 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.

అంతకు ముందు అమర వీరుల స్మారక స్తూపం వద్ద అమరులకు ఘన్నంగా నివాళులర్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్, జిల్లా ఎస్పీ కె.నరసింహ, జడ్చర్ల శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులు కోడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ ఇంచార్జి అధ్యక్షులు కొరమోని వెంకటయ్య, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రెల కాపరుల పెంపకం సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story