మన్య నీర్లకుంట రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతులకు అందిస్తాం

by Naresh |
మన్య నీర్లకుంట రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతులకు అందిస్తాం
X

దిశ, దేవరకద్ర: 15 గ్రామాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉన్న మన్య నీర్ల కుంట రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతులకు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి దేవరకద్ర మండలం అజిలాపూర్ సమీపంలోని మన్యం కొండ గుట్టల మధ్య ఉన్న మన్య నీర్ల కుంటను ఇరిగేషన్ అధికారులు , రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ నిర్మించేందుకు, తద్వారా వచ్చే ఆయకట్టు, పలు అంశాలపై ఇరిగేషన్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… అతి తక్కువ ఖర్చుతో మన్య నీర్ల కుంట వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయవచ్చని, ఈ రిజర్వాయర్‌కు చౌదర్పల్లి చెరువు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకుని, గ్రావిటీ ద్వారా 4 మండలాలలోని 15 గ్రామాల (హజీలపూర్, లక్ష్మీ పల్లి, బస్వాయి పల్లి, గోపన్ పల్లి, కౌకుంట్ల, ఇస్రంపల్లి, రేకులంపల్లి, చక్రాపూర్, దాసర్ పల్లి, వేముల, తుణికిపూర్, కొమ్మిరెడ్డి పల్లి, నందిపేట్, పొన్నాకల్, రాచాల) చెరువులకు నీరు అందించడం వల్ల 8000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. రిజర్వాయర్‌కు సంబంధించిన ప్రపోజల్స్ త్వరలో ఇరిగేషన్ అధికారులతో తీసుకొని, ఇరిగేషన్ మంత్రితో చర్చించి రిజర్వాయర్ నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజల్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, కిరణ్ రెడ్డి, చందు గౌడ్ ,భీమ్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story