ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Kalyani |   ( Updated:2023-05-06 12:11:18.0  )
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. శనివారం ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయం సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లతో ఎలక్టోరోల్ రూపకల్పనపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చివరి క్షణంలో ఓటరు జాబితాలో ఈ వ్యక్తి పేరు లేదని గానీ, ఉన్న పేరును సమాచారం లేకుండా తొలగించారని, లేదా ఒకే వ్యక్తి పేరున ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండటం, మరణించిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉండటం వంటివి లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించుకోవాలన్నారు.

ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు వస్తుంటాయని అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్లు అన్ని పోలింగ్ బూత్ లకు బీఎల్ఓలను నియమించి బీఎల్ఏలకు కలిపి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, ఏ బూత్ ఓటరు అదే ఏరియాలో ఉండే విధంగా చూసుకోవడం, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే తొలగించాలన్నారు. మండల స్థాయిలో ప్రతి శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు.

ఎన్నికలకు సంబంధించి ఏ పని చేసిన నిబంధనలకు లోబడి చేయాలని అందుకు ఎన్నికల నియమావళి పుస్తకాలు చదవాలని సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా లేదా నిర్లక్ష్యం వహించిన ఉపేక్షించబోమని హెచ్చరించారు. కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారందరికీ ఎపిక్ కార్డు వచ్చే విధంగా చూడాలని తెలియజేశారు. ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే డిప్యూటీ తహసీల్దార్ స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్ దానయ్య, ఎన్నికల డీటీలు మధుసూదన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed