జోగులాంబ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

by Sridhar Babu |
జోగులాంబ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
X

దిశ, అలంపూర్ టౌన్ : ప్రాచీన ఆలయాలకు నిలయమైన అలంపూర్ లో వెలిసిన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం సంపత్ కుమార్ తో కలిసి కొండా సురేఖ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాల సమీపంలో కేంద్ర నిధులతో నిర్మించిన ప్రసాద్ పథకం భవనాన్ని పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను పర్యాటకశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి హరిత టూరిజంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. వరంగల్ లోని రామప్ప, వేయి స్తంభాల గుళ్ల మాదిరిగానే ఈ ఆలయాలు కూడా ప్రాచీనతను సంతరించుకున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రసాద్ పథకం పనులను త్వరలోనే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆలయాలు నిరాధారణకు గురయ్యాయని విమర్శించారు. కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో ఏకో టూరిజం, పర్యాటక శాఖతో సమన్వయం చేసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మజ్జిగ, పాలు, పిల్లలకు బాలామృతం అందివ్వాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed