జయపాల్ యాదవ్ అసమర్థ ఎమ్మెల్యే : టి.ఆచారి

by Sridhar Babu |
జయపాల్ యాదవ్ అసమర్థ ఎమ్మెల్యే : టి.ఆచారి
X

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి ఎమ్మల్యే జయపాల్ యాదవ్ పెద్ద అసమర్దుడని బీజేపీ రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడారు. 2018 –2023 వరకు కల్వకుర్తి నియోజకవర్గానికి ఏసీడీపీ, ఎస్డిఎఫ్, సీబీఎఫ్, సీఆర్ఎస్ నిధులు ఎన్ని వచ్చాయి.. ఎన్ని ఖర్చులు చేశారు.. అనే విషయాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చిన గణాంకాలను వెల్లడించారు. 2017 –2023 వరకు పదకొండు కోట్ల రూపాయలు ఏసీడీఎఫ్ నిధులు మంజూరైతే అందులో జయపాల్ యాదవ్ ఖర్చు చేసింది 3 కోట్ల 77 లక్షలు మాత్రమేనని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ , జిల్లా కలెక్టర్ నిధులను కూడా నియోజకవర్గానికి ఖర్చు చేయలేని స్థితిలో ఉండటం కల్వకుర్తి వాసుల దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన నిధులను ఖర్చు చేయకుండా, కొత్త నిధులు తేకుండా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గుదిబండగా మారాడని మండిపడ్డారు. పత్రిక ప్రకటనలో సభలు, సమావేశాల్లో ఊక దంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యడని ఎద్దేవా చేశారు. సభలు, సమావేశాల్లో నోరు తెరిస్తే 5 వేల కోట్లు తెచ్చానని గప్పాలు కొడుతున్నాడని, ఎక్కడి నుంచి తెచ్చాడో.. ఎలా తెచ్చాడో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏ శాఖ ఎక్కడుంటుందో, ఏ కార్యదర్శి ఎక్కడ ఉంటాడో తెలియదని, ఆయన ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నియోజకవర్గ ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా తన వల్లనే జరిగిందని గప్పాలు కొడుతున్న ఎమ్మెల్యేని చూసి నియోజకవర్గ ప్రజలు అసహ్యించు కుంటున్నారని తెలిపారు. గజ్వేల్ కు 9 వందల 30 కోట్లు, సిద్దిపేటకు 740 కోట్లు ఖర్చు చేస్తే, కల్వకుర్తి నియోజకవర్గానికి 2 కోట్ల 8 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని, దీన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ను అసమర్డుడు అనక ఏమనాలని ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే రెండు జాతీయ రహదారులున్నాయని, ఇప్పుడు మరో జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయని, ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ చలువతో అయ్యాయని, ఈ రోడ్లు కూడా తానే తెచ్చానని ఎమ్మెల్యే అంటాడని ఎద్దేవా చేశారు.

తాను బీసీ కమిషన్ సభ్యుని హోదాలో జాతీయ రహదారి నిర్మాణానికి సెంట్రల్ లైటింగ్ కు కృషి చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్దిపై ఎప్పుడు మాట్లాడని, ప్రశ్నించని, ఉద్యమించని ఎమ్మెల్యే ఎందుకు నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా మీరు కల్వకుర్తి కి చేసిన మేలు ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో కల్వకుర్తి కి సాగు నీరు రావడంలో, ఆర్డీవో కేంద్రం ఏర్పాటులో ఆయన పాత్ర ఏందో నియోజకవర్గ ప్రజలందరికి తెలుసని అన్నారు. ఆయన ఎమ్మెల్యే గా ఉంటే నియోజకవర్గం తిరోగమన దిశలో పయనిస్తుందని ఆరోపించారు. 2018 నుంచి ఇప్పటి వరకు కేఎల్ఐ పాలమూర్ - రంగారెడ్డి పథకాల్లో ఇంచ్ మందం కుడా అభివృద్ధి జరగలేదని, ఒకవేళ జరిగుంటే చర్చకు సిద్దంగా ఉండాలన్నారు. నియోజకవర్గాన్ని ఏ రంగంలో కూడా అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా జయపాల్ యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల తీసుకొస్తానని పేర్కొన్నారు. దీనికి సిద్దమేనా.. అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా , స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed