కృష్ణా నదిలో యథేచ్ఛగా సాగుతున్న మత్స్య దోపిడీ..

by Naveena |
కృష్ణా నదిలో యథేచ్ఛగా సాగుతున్న మత్స్య దోపిడీ..
X

దిశ, కొల్లాపూర్: చేపల వేటే వృత్తిగా ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద లక్షల చేప పిల్లలను జిల్లా మసక శాఖ అధికారులు విడుదల చేశారు. అయితే చేప పిల్లలను ఎదగనీయకుండా పునరుత్పత్తి జరగనీయకుండా నిషేధిత ఆలవి వలలను ఉపయోగించి ఇతర రాష్ట్రాల జాలర్ల సాయంతో మత్స్య సంపదనంతా దోచేస్తున్నారు. దీంతో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను వదిలినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జూన్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు శ్రీశైలం ప్రాజెక్టులో తిరుగు జలాలు నిల్వ ఉంటాయి. ఈ సమయంలో చేపల ఉత్పత్తి ఘనంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా మత్స్యశాఖ అధికారులు లక్షల సంఖ్యలో పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను నదిలో వదులుతూనే ఉంటారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కృష్ణా నది 120 కిలో మీటర్ల నిడివిన తీరం వెంట చిన్నం బావి మండలం గడ్డబస్వాపూర్ నుంచి పాతాళ గంగ వరకు సుమారు 150కి పైగా పోరుగు రాష్ట్రాల జాలర్ల కుటుంబాలు తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మత్స్య మాఫియా జాలర్లకు అడ్వాన్సుగా డబ్బులు ఇచ్చి తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. జాలర్లు పట్టిన చేపలను కిలోకు రూ, 80 నుంచి రూ,100 లు చొప్పున మాఫీయా కొనుగోలు చేస్తూ..జాలర్లు ఇటు ధర,అటు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మాఫియా చేతుల్లో ఆంధ్ర జాలర్లు దశాబ్దాలుగా మోసపోతున్నారు.కృష్ణా నదిలో నీటిమట్టం క్రమేణా తగ్గుతుండడంతో..పెద్ద మారూరు,మంచాలకట్ట,జటప్రోలు,మలేశ్వరం,సోమశిల,అమరగిరి,చీమల తిప్ప,కోతి గుండు,వేములపాయ,పాతాళ గంగ వరకు నది తీరం వెంట నిషేధిత అలవి వలలతో మత్స్యసంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.

పౌల్ట్రీ ఫాంలకు ఎండు చేపలు ఎగుమతి

ప్రతి ఏటా మత్స్య మాఫియా రూ,కోట్లలో దోచుకుంటున్నారు. అలవి వలెలను ఒకసారి నదిలో వేస్తే పది నుంచి 15 కింట్వాల వరకు చిన్న చేపలతో సహా చిక్కుతాయి. చిన్న చేపలను నది తీరం ప్రాంతంలోనే ఎండబెట్టి బస్తాలలో నింపి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ,గుంటూరు, వైజాగ్,తెలంగాణలోని కోదాడ,మిర్యాలగూడ,సూర్యాపేట,హైదరాబాద్ వంటి ప్రాంతాలలోని పౌల్ట్రీ ఫాంలకు కిలో రూ,300లు చొప్పున రాత్రివేళ అక్రమంగా రవాణా చేస్తున్నారు. సోమశిల,మంచాలకట్ట,అమరగిరి,కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన ఎండు చేపల వ్యాపారులు ప్రతి ఏటా రూ,కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆ నదిలో నీటిమట్టం క్రమంగా నీటిమట్టం తగ్గుతుండడంతో..ఆంధ్ర జాలర్ల చేత నిషేధిత వలలను ఉపయోగించి చేప గుడ్డుతో సహా ఊడ్చేచేస్తున్నారు. ఇలా మత్స్య మాఫియా దోచుకున్న డబ్బుతో కొల్లాపూర్ ప్రాంతంలో భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. దోపిడికి గురవుతున్న మత్స్య సంపదను నియంత్రించాల్సిన ప్రభుత్వ పలు శాఖల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నట్లు విమర్శలను మూట గట్టుకున్నారు.

ముందుగానే అందుతున్న దాడుల సమాచారం

మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడంలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో గత రెండు నెలల కిందట సోమశిల, అమరగిరి,మంచాలకట్ట,ఇతర ప్రాంతాల్లో జిల్లా మత్స్యశాఖ అధికారులు విడుదల చేశారు. వాటిని విడిచిపెట్టిన నెల రోజుల వ్యవధిలోనే జాలర్లు చేపల వేట కొనసాగిస్తున్నారు. మత్స్య దోపిడీని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. స్థానిక పోలీసుల సహాయంతో మత్స్యశాఖ అధికారులు నది తీరంలో ఒకవేళ దాడులు నిర్వహించిన అవి మొక్కుబడిగానే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని నది తీర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే కృష్ణానది తీరంలో నిషేధిత అలవి వలలతో కొనసాగిస్తున్న జాలర్లపై దాడులకు అధికారులు వస్తున్న సమాచారం ముందస్తుగానే అందుతుంది. దీంతో అధికారుల రాకను పసిగట్టి జాలర్లు సరంజామా తో ఉడాయిస్తున్నారు. దాడులకు వచ్చే అధికారులకు కాసుల ఎరాతో మత్స్య మాఫియా ఈ తతంగం గత దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉన్నది ఈ మాఫియా దందాను నియంత్రించాలని కృష్ణా నది తీరా గ్రామాల మత్స్యకారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed