ఆస్పత్రి గేటు వద్ద మహిళ ప్రసవం.. గవర్నర్ తమిళిసై సీరియస్

by Disha News Web Desk |
ఆస్పత్రి గేటు వద్ద మహిళ ప్రసవం.. గవర్నర్ తమిళిసై సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ప్రసవం ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. గురువరం రోజు బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం గురించి వైద్యాధికారులతో మాట్లాడిన గవర్నర్ విషయం తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్యాధికారులను హెచ్చరిస్తూ, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావని రాష్ట్ర ప్రజలకు తమిళిసై హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. బాధితురాలికి కేసీఆర్ కిట్ అందేలా చూస్తామని తెలిపారు.

కాగా, నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం 8 గంటలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు 10 గంటలకు కరోనా పరీక్ష చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు ప్రసవం ఇక్కడ చేయలేమని, పీపీఈ కిట్లు కూడా లేవని చెప్పారు. అప్పటికే మహిళకు నొప్పులు తీవ్రమయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డా.హరిబాబు సూచించారు. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువవడంతో లాలమ్మను ఆమె వెంట ఉన్న అక్కాచెళ్లెలిద్దరూ ఆసుపత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకెళ్లి కాన్పు చేశారు. గమనించిన వైద్య సిబ్బంది బిడ్డను, తల్లిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు.. కరోనా బాధిత చెంచు మహిళకు ప్రసవం చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన డా.హరిబాబును సస్పెండ్‌ చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed