- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్వాల ఎమ్మెల్యే ఎటువైపు.. ఈ ట్విస్ట్ ఇంకెన్నాళ్లు..?
దిశ ప్రతినిధి, గద్వాల: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం ఎటూ తేలట్లేదు.. ఇప్పుడు ఆయన బీఆర్ ఎస్ లో ఉన్నాడా.. లేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆగమాగం వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కానీ మళ్లీ కేటీఆర్ ను కలిసి ఘర్ వాపసీ అన్నాడు. కానీ బీఆర్ ఎస్ లో తిరగట్లేదు.. అటు కాంగ్రెస్ ను వీడానని చెప్పట్లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కృష్ణమోహన్ రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కొన్ని నెలలకే తిరిగి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే అధికార పార్టీ నేతల ఒత్తిడి అయితేనేమి.. ఇతర కారణాలతో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం, రాజకీయంగా రసవత్తర చర్చలకు తెరలేపింది. కాంగ్రెస్ పెద్దలతో పలు హామీలు తీసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరిగింది.
కండువా కప్పుకోలే.. మీడియాతో మాట్లాడలే..
బీఆర్ఎస్ ను వీడిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని గద్వాల ప్రజలు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించలేదు. నియోజకవర్గంలోని ఆయా మండలాలలో పర్యటించే సమయాలలోనూ ఆయన అభిమానులు గాని, కాంగ్రెస్ వాదులు కానీ పార్టీ కండువాను కప్పలేదు. ఎమ్మెల్యే మెడలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కండువా లేకపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పుడు గాని, తిరిగి బీఆర్ఎస్.. ఆపై మళ్లీ కాంగ్రెస్ లో చేరినప్పుడు గాని కృష్ణమోహన్ రెడ్డి పార్టీల మార్పులకు సంబంధించి ఎటువంటి వివరణలు ఇవ్వలేకపోవడం ఆసక్తిని రేపుతోంది. అక్కడక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప, ప్రభుత్వ పనితీరును గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు.
అనుకూలమైన సిబ్బందిని..
నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉండే అధికారులను తిరిగి బదిలీపై రప్పించుకునేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పావులు కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్ శాఖలకు సంబంధించి తనతో గతంలో సన్నిహితంగా ఉన్న వారిని బదిలీపై రప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనమాటకు విలువ ఇవ్వని పోలీస్, ఇతర అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రులు, అధికారులపై ఘాటుగా వ్యాఖ్యలు..
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, అధికారులపై పలువురు మీడియా ప్రతినిధులు, సన్నిహితుల వద్ద ఘాటు వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు, ఇతర ప్రధాన సమస్యలకు సంబంధించి సంబంధిత శాఖల మంత్రులకు, వారి ఓఎస్డీలకు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని ఎమ్మెల్యే వాపోతున్నట్లు సమాచారం. ఒకవైపు పార్టీ కండువా కప్పుకోకపోవడం.. పార్టీ మారిన తర్వాత మీడియా సమావేశాలను నిర్వహించి పార్టీ మారడానికి గల కారణాలను వివరించకపోవడం, ఇప్పుడు మళ్లీ మంత్రులు, అధికారులపై ఘాటు వ్యాఖ్యానాలు చేస్తుండడం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ చర్చనీయాంశంగా మారారు.