ప్రమాదమని తెలిసినా.. తప్పని ప్రయాణం

by Naveena |
ప్రమాదమని తెలిసినా.. తప్పని ప్రయాణం
X

దిశ, అలంపూర్: ప్రమాదకరమని తెలిసిన.. ప్రయాణం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతినిత్యం ఏదో ఒకచోట యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతున్న... అయ్యో పాపం అంటూనే చాలామంది ఈ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తరచు ప్రమాదకరంగా విద్యార్థులతో పాటు, ఆయా గ్రామాల ప్రజలు, కూలీలు వంటి వారు తమ అవసరాల కోసం ప్రమాదకరమైన ప్రయాణాలు చేయక తప్పడం లేదు. గత రెండేళ్లుగా రైతు పరిస్థితి దయనీయంగా మారింది.

పంట పొలాలపై చేసుకున్న అప్పులు భారీగా పెరగుతుండటం.. మిరప తెంపుకోలేక ఇంకా పోలాల్లోనే ఉంచుకున్నాడు. మిర్చి పంటను తెంపుకొనుటకు కూలీలను ఇతర ఇతర గ్రామాల నుండి వందల మందిని పిలిపించుకుని మిర్చి పంటను తెంపుకోవడం... కల్లాల్లో ఆరబెట్టుకోవడం చేస్తున్నారు. దీనికోసం కూలీలు ప్రమాదకరంగా నిత్యం ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్క వాహనంలో 30 నుండి 50 మంది దాకా వస్తూ ఉండడం, ఏదో ఒకచోట యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోవడం ప్రతినిత్యం జరుగుతూనే ఉంది. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఈ ప్రయాణం చేస్తున్నామని రైతు కూలీలు వాపోతున్నారు. వాహనంలో తక్కువ మంది వచ్చి పంట భూముల్లో కూలి పని చేస్తే కూలి గిట్టుబాటు కాకపోవడంతోనే ఈ ప్రయాణం చేస్తున్నామని, మమ్మల్ని ఆ దేవుడే కాపాడుతాడని భారంతో ప్రతిరోజు భయంతో ప్రయాణం చేస్తూ జీవనం సాగిస్తున్నామని ఆయా గ్రామాల కూలీలు అంటున్నారు.

మేము నడిపే ఈ ప్రమాదకరమైన ప్రయాణం ఫ్యాషన్ గా చేయడం లేదని, తప్పని పరిస్థితుల్లో కాస్త డబ్బులు మిగులుతాయని ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ.. ఎక్కడ కూడా పొరపాటు కాకుండా సురక్షితంగానే నడుపుతున్నామని ఆటో డ్రైవర్లకు సైతం అంటున్నారు. పంట పనులు జరిగేటప్పుడు మా వాహనాలను తనిఖీ చేసి ఆర్టిఏ అధికారులు భారీ మొత్తంలో ఫైన్లు వేయడంతో చేసేది ఏమీ లేక అప్పులైన సరే కట్టుకొని ఈ ప్రమాదం చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోని ఈ ప్రయాణం చేస్తామని, మిగతా సమయంలో పరిమితికి మించి ప్రయాణం చేయమని గట్టిగానే డ్రైవర్లు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కెపాసిటీకి మించి వాహనాల్లో కూలీలను ప్రజలను ఎక్కించుకొని ప్రయాణం చేస్తే ఏదో ఒకచోట ప్రమాదం జరిగి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కెపాసిటీ మించి కూలీలను ఎక్కించుకున్న నిదానంగా వెళ్లి.. సురక్షితంగా ఇంటికి చేరిస్తే ఎలాంటి ఎవరికీ ఇబ్బంది ఉండదు. మితిమీరిన ప్రయాణం... అతివేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, ఉండవెల్లి మండలాల్లో ఇంకా పంట భూముల్లో పనులు కొనసాగుతున్నాయి. పంట పనులు చేయడానికి ఇతర ఇతర గ్రామాల నుండి భారీగా కూలీలు వస్తుండడం, మితిమీరిన ప్రయాణం, అతివేగంతో నడిపే వాహనాలతో చాలాచోట్ల ప్రమాదాలు సంభవించి కూలీలు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్న వాహన డ్రైవర్లు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ప్రయాణం చేస్తున్నారు. ఏ వాహనం చూసిన 30 నుండి 50 మంది దాకా కూలీలు వాహనాల్లో ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. వెతికి చూడు ట్రాక్టర్ల డ్రైవర్లు కూడా కెపాసిటీకి మించి లోడు వేసుకొని, ట్రాక్టర్ డోర్లను తెరుచుకొని వెళ్తుండటంతో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి.

కొన్ని గ్రామాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి ప్రయాణం చేయడం ప్రమాదమని తెలిసిన తప్పని పరిస్థితుల్లో ఈ ప్రయాణం చేస్తున్నారు. ఎవరిది కరెక్టు... ఎవరిది తప్పు తెలియని పరిస్థితి ఏర్పడింది. నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నారని, ఇలా చేయడంతో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని, ఆర్టిఏ అధికారులు వాహనాలు నిలిపి ఫైన్లు వేసి కేసులు నమోదు చేస్తే రైతులు, రైతు కూలీలు, ఆటో డ్రైవర్లు లబోదిబో అంటున్నారు. చేసే కష్టమంతా వాహనాలపై పడిన కేసులు ఫైన్ లు కట్టుకోవడానికి సరిపోతుందని, మేము ఎలా జీవించాలని అంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి కూలీలను వాహనాల్లో ఎక్కించుకోకుండా నడుపుతే ఆర్టిఏ రూల్స్ ప్రకారం వాహనాలకు ఎక్కడ కూడా ఫైన్స్ వేయమని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా పరిమితికి మించి ప్రయాణం చేయడం ఎప్పటికైనా ప్రమాదమే. కూలీలు సైతం కాస్త ఆలోచన చేసి... ఈ ప్రయాణం చేయడం ప్రమాదమని భావించి సురక్షిత ప్రయాణం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదంలో ప్రాణాలు పోతే తమ పైన ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి.

Next Story

Most Viewed