మాదకద్రవ్యాలు సమాజానికి అత్యంత ప్రమాదకరం : సీనియర్ సివిల్ జడ్జి

by Sumithra |
మాదకద్రవ్యాలు సమాజానికి అత్యంత ప్రమాదకరం : సీనియర్ సివిల్ జడ్జి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మాదకద్రవ్యాల వాడకం సమాజానికి అత్యంత ప్రమాదకరమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. బుధవారం మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో సుమారు 7 కోట్లమంది మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఇటీవలే, ప్రయోగాత్మక అధ్యయనాలు వెల్లడించినట్లు ఆమె తెలిపారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం నిర్మూలన కోసం రాష్ట్రంలోని అనేక ఏజెన్సీలు, స్వచ్చంద సంస్థలు రంగంలోకి దిగినప్పటికి వాటి మధ్య సమన్వయం కొరవడిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేక సమావేశాలు నిర్వహిస్తుందని ఆమె వివరించారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణకు చైతన్య ర్యాలీని జడ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కో ఆర్డినేటర్ లావణ్య, సురయ్య, జబీన్, పుష్పలత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed