నాగర్ కర్నూల్ జిల్లాలో డ్రగ్స్ మాఫియా కలకలం..

by Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లాలో డ్రగ్స్ మాఫియా కలకలం..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. కల్తీకల్లు తయారీ కోసం ఇతర ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా తెరచాటున కల్తీకల్లు తయారు చేసేవారు ప్రజల ప్రాణాలు బలికావద్దన్న ఉద్దేశంతో కొంతమేర చెట్టు నుంచి తీసిన కల్లును కూడా వాడేవారు. కానీ ప్రస్తుతం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను అమాయక జనానికి అంటగడుతున్నారు. అమాయక కష్టజీవులకు కల్లు రూపంలో, యువతకు పొడి రూపంలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు భారీ కుట్రకు తెరలేపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం ప్రాంతంలోని కోళ్ల ఫారంలో తయారు చేస్తున్న ఆల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైందని అధికారులు గుర్తించారు. ఈ నిర్వాహకులకు జిల్లా రాష్ట్రస్థాయిలో అండదండలు ఉండడంతో ఖచ్చితమైన సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు దాడులు చేసి పట్టుకునేంతవరకు రహస్యంగా ఉంచారు. నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో మత్తు పదార్థాల తయారీ జరుగుతుందని ఆరోపిస్తూ గత మార్చి 30న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమక్షంలో జిల్లా అధికారులను హెచ్చరించారు.

అయినా జిల్లా ఉన్నతాధికారులు సైతం పెడచెవిన పెట్టిన నేపథ్యంలో కోళ్ల ఫారం అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాలు తయారీ చేస్తున్న కేంద్రం బయట పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. జిల్లా అధికారులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకోవడంతో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కల్తీ కల్లు తయారు చేసి వందల మంది ప్రాణాలతో కల్తీ కల్లు మాఫియా చెలగాటం ఆడుతోందని బీఎస్పీ పార్టీ నేతలు సైతం మూడు నెలల క్రితం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని నిర్బంధించి నిరసన తెలిపారు.

అయినా ఎక్కడా దాడులు నిర్వహించిన దాఖలాలు లేకపోవడం విశేషం. కోళ్ల ఫారం అడ్డాగా చేసుకొని నిర్భయంగా భారీ స్థాయిలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్న ముఠాకు రాష్ట్ర స్థాయి పెద్దల మద్దతు ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కల్తీకల్లు తయారీ కోసం ఆల్ఫాజోలం, డైజోఫాం, చక్రీన్, సిహెచ్ వంటి మత్తు పదార్థాలు బెంగుళూరు, హైద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పరిమితిలో మాత్రమే తెచ్చుకునే పరిస్థితి. కానీ ఇక్కడే తయారీ చేయడం వల్ల ఇష్టారీతిగా వాడుకునే పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుండగా నాగర్ కర్నూల్ జిల్లా కల్తీకల్లు మాఫియా గ్యాంగ్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం.

దీనికి తోడు తయారీ చేసిన మత్తు పదార్థాలు చిన్నపాటి పొట్లాలుగా మార్చి గ్రామీణ యువతకు కూడా మత్తుకు అలవాటు చేసే కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ఓ మంత్రి తెరవెనక ఉండి కల్తీ కళ్ళు మాఫియా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలతోనే నాగర్ కర్నూల్ జిల్లాలోనూ మత్తు పదార్థాల తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది.

అబ్కారీ శాఖ నిఘా కరువు..

మద్యపాన నిషేధం కోసం పని చేయాల్సిన అబ్కారీ శాఖ యువత మత్తులో తూగేలా ప్రోత్సహిస్తుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు సాయంతో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతున్నా బెల్టు షాపులే లేవని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నకిలీ మద్యం కారణంగా జిల్లా కేంద్రంలో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడినా అబ్కారీ శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు. తాజాగా కోళ్ల ఫారం అడ్డాగా చేసుకొని మత్తు పదార్థాలను తయారు చేస్తున్నప్పటికీ తమ దృష్టికే రాలేదని చెప్పడం అలసత్వానికి నిదర్శనంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం కట్టుబడిన వ్యక్తులు గతంలోనూ పట్టుబడి జైలుకు వెళ్లి రావడం విశేషం. అయినా వారిపై నిఘా ఉంచకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందులో భాగంగానే డీఆర్ఐ అధికారులు స్థానిక పోలీసు, అబ్కారీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. కల్తీ కల్లు దందాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజా ప్రతినిధి నుంచి ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులకు కూడా నెల వాటాలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి పొలిటికల్ సపోర్టు పుష్కలంగా అందుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story