బెడిసి కొట్టిన బీఆర్ఎస్ వ్యూహం... రేపే ఎన్నికలు

by srinivas |
బెడిసి కొట్టిన బీఆర్ఎస్ వ్యూహం... రేపే ఎన్నికలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలకంగా ఉన్న డీసీసీబీ పదవిని నిలుపుకోవడానికి బీఆర్ఎస్ అధిష్టానం చేసిన యత్నాలు విఫలమయ్యాయని ప్రచారం సాగుతోంది. మొత్తం 15 మంది మంది డీసీసీబీ డైరెక్టర్లలో గతంలో ఏకంగా 12 మంది బీఆర్ఎస్ మద్దతుదారులే ఉన్నారు. ఈ కారణంగానే బీఆర్ఎస్ డైరెక్టర్ చిట్యాల నిజాం పాషా డీసీసీబీ చైర్మన్‌గా ఎంపిక కావడం, పదవిలో ఉండగానే గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యానికి గురైన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో చైర్మన్ ఎంపిక అనివార్యం అయ్యింది. ఈనెల 23న ఎన్నిక నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఈ పదవిని దక్కించుకునేందుకు గత 20 రోజులుగా ప్రయత్నాలు ప్రారంభించి సక్సెస్ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. మెజార్టీ సభ్యులను తమ వైపునకు తిప్పుకోవడంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు చేయడంతో డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.

కాంగ్రెస్ గూటిలో 11 మంది డైరెక్టర్లు

మొత్తం 15 మంది డీసీసీబీ డైరెక్టర్లకు గాను 11 మంది డైరెక్టర్లు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జీఎంఆర్, అనిరుధ్ రెడ్డి, మెఘారెడ్డి, ఈర్లపల్లి శంకర్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్న మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇస్తామని సంతకాలు చేసి మంత్రి, ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు సమాచారం. చైర్మన్ పదవి కోసం పోటీలో ఉంటారని భావించిన ప్రస్తుత డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, డైరెక్టర్లు రంగారెడ్డి, వంశీ చందర్ రెడ్డి, నరసింహారెడ్డి, భీమ్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నర్సింలు, చంద్ర నాయక్, భూపాల్ రావు, వెంకటేష్, విష్ణువర్ధన్ రెడ్డి సమావేశానికి హాజరుకాగా మంజుల రెడ్డి, బక్కన్న యాదవ్, జక్కా రఘునందన్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా గైర్హాజరయ్యారు. వీరిలో నిజాం పాషా, రఘునందన్ రెడ్డి సైతం విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఆలస్యంగా మేల్కొన్న బీఆర్ఎస్ అధినేతలు

డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకునే విషయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతల నిర్లక్ష్యం వల్లే పదవిని కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 15 మంది సభ్యులకు గాను ఏకంగా 12 మంది సభ్యులు బీఆర్ఎస్ వారు ఉన్నారు. చైర్మన్ పదవికి నిజాం పాషా రాజీనామా చేసినప్పుడు తమకు ఏమీ పట్టదు అన్నట్లుగా ఉండడంతో కాంగ్రెస్ నేతలు తమ పనులు తాము కానించుకుంటూ ముందుకు సాగారు. ఎన్నికలకు మరో రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తమ డైరెక్టర్లకు వెంటనే హైదరాబాద్ కు రావలసిందిగా సమాచారం పంపారు. కానీ అప్పటికే డైరెక్టర్లు కాంగ్రెస్ గూటిలో ఉండడంతో కేవలం ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే కేటీఆర్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. మొత్తంపై బీఆర్ఎస్ అధినేతలు తమ నిర్లక్ష్యం వల్ల, డైరెక్టర్లను పట్టించుకోకపోవడం వల్ల కీలకమైన పదవిని కోల్పోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

నేరుగా ఓటింగ్ కే...

హైదరాబాద్‌లో బుధవారం మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశానికి వెళ్లిన 11 మంది డైరెక్టర్లు అక్కడే ఉండి రాత్రి ఒక హోటల్లో బస చేసినట్లు సమాచారం. గురువారం ఉదయం కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed