హత్య చేయడానికి వచ్చి హతమై...

by Sridhar Babu |
హత్య చేయడానికి వచ్చి హతమై...
X

దిశ, వెల్గటూర్ : కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు... తుపాకీ పట్టినోడు తుపాకీ తోనే హతం అవుతాడనే నానుడి ఈ సంఘటనలో అక్షరాల నిజమైంది. సుపారీతో ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం పన్నిన ముంబై గ్యాంగ్ స్టర్ రాహుల్సూర్య ప్రకాష్ సింగ్ (24) సుపారీ ఇచ్చిన వారి చేతుల్లోనే హత్యకు గురికావడం సంచలనం రేపింది. ప్రశాంతంగా పొలం పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పల్లె జనం సమీప అటవీ ప్రాంతంలో జరిగిన సుపారీ హత్య ఘటన వెలుగులోకి వచ్చేటప్పటికి ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కడంతో హత్యకు పాల్పడిన నిందితులు భయపడి ధర్మపురి పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీఎస్పీ రఘు చందర్, సీఐ రాంనర్సింహారెడ్డి ఆదివారం నిందితులను తీసుకొని హత్య జరిగిన స్థలం తో పాటు శవాన్ని దహనం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించి హత్య జరిగిన తీరును వివరించారు.

ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మణ్​, కమలాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల గోపాల్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరు ముంబైలో కల్లు బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల కొంత కాలం నుంచి మెరుగు లక్ష్మణ్ మరదలును నేరెళ్లకు చెందిన తోకల గంగాధర్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. పలుమార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో గంగాధర్ ను ఎలాగైనా చంపేసి తన మరదలుకు ప్రశాంత జీవనం అందించాలని అను కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన నేరెళ్ల గోపాల్ కు వివరించి గంగాధర్ ను చంపడానికి ఎవరితోనైనా మాట్లాడాలని కోరాడు. తనకు తెలిసిన ముంబైకు చెందిన రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ అనే గ్యాంగ్ స్టార్ ఉన్నాడని, అతనికి సుపారీ ఇస్తేనే హత్య చేయడానికి ఒప్పు కుంటాడని గోపాల్ లక్ష్మణ్ తో అన్నాడు. రూ.4 లక్షల సుపారీ ఇవ్వడానికి లక్ష్మణ్ ఒప్పుకోగా గోపాల్ ఈ విషయాన్ని గ్యాంగ్​స్టర్ రాహుల్ ప్రకాష్ సింగ్ కు వివరించగా ఆయన డీల్ ఒకే చేశారు. ఇంకేముంది మర్డర్ చేయడానికి డేట్, టైం అన్నీ సెట్ చేసుకున్నారు.

కాగా ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. గ్యాంగ్​స్టర్ సుపారీ డబ్బులు ఇవ్వాలని ఓ రోజు గోపాల్, లక్ష్మణ్​కు ఫోన్ చేశాడు. ఎవరిని హత్య చేయాల్సిన అవసరం లేదని, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని వీరిద్దరూ గ్యాంగ్​స్టర్ కు తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుంచి గ్యాంగ్​స్టర్ రాహుల్ ప్రకాష్ సింగ్ తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని గోపాల్ కు వార్నింగ్ ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వక పోతే మీ తండ్రి రమేష్ ను చంపుతా అంటూ బెదిరిస్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన గోపాల్ అతనితో రాజీకుదుర్చుకున్నాడు. డీల్ ప్రకారం నీ సపారీ ఇచ్చేస్తా ఈనెల 12న నేరెళ్లకు రావాలని కోరగా రాహుల్ వచ్చాడు. 13న అర్ధరాత్రి సమయంలో గోపాల్ నేరెళ్లకు చెందిన గండికోట శేఖర్ తో కలిసి రాహుల్ ను నేరెళ్ల సాంబ శివ గుడి వద్దకు తీసుకెళ్లి అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో రాహుల్ ను శేఖర్ మాటల్లో పెట్టగా గోపాల్ పెద్ద బండరాయితో రాహుల్ తలపై మోది హత్య చేశాడు.

హత్య చేసిన విషయం వెలుగులోకి రావద్దని ఆలోచనతో శవాన్ని తీసుకొని సమీపంలో ఉన్న బట్ట పెళ్లి పోతారం అడవుల్లోకి వెళ్లారు. కట్టెలు పోగేసి శవాన్ని అందులో వేసి పెట్రోల్ పోసి కాల్చి వేశారు. శవం పూర్తిగా కాలిందో, లేదో అని మరుసటి రోజు నిందితులు అక్కడికి వెళ్లి పరిశీలించి సగం కాలిన శవాన్ని మళ్లీ కట్టెలు వేసి పూర్తిగా దహనం అయ్యాక ఇంటికి వెళ్లారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కి పోలీసుల వద్దకు చేరింది. దాంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంతలో నిందితులు నేరేళ్ల గోపాల్, గండికోట శేఖర్ కలిసి రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ ను తామే హత్య చేశామని ధర్మపురి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. దీంతో హత్యకు సంబంధించిన విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. దీంతో హత్య జరిగిన స్థలమైన నేరెళ్ల సాంబశివ గుడితో పాటు దహనం చేసిన స్థలాన్ని పరిశీలించినట్టు డీఎస్పీ రఘు చందర్, సీఐ రాం నరసింహారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story