విస్తరించనున్న సహకారం..ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వాధికారులు

by Aamani |
విస్తరించనున్న సహకారం..ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వాధికారులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) సేవలను మరింత విస్తరించేలా చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి సారాధ్యంలో అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కేంద్రంతోపాటు ప్రస్తుతము ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 22బ్రాంచీలతో డీసీసీబీ కార్యకలాపాలు సాగుతున్నాయి. 15ఏండ్లుగా అదనంగా బ్రాంచీలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు, ప్రజలకు తగిన స్థాయిలో సేవలు అందలేదు. దీనితో బ్యాంకు సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. 90 రోజుల క్రితం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి బ్యాంకును మరింత బలోపేతం చేయడంతో పాటు.. రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

20 కొత్త బ్రాంచీలకు ప్రతిపాదనలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీసీసీబీ బ్యాంకు సేవలను మరింతగా విస్తరించే లక్ష్యంతో కొత్తగా 20 బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపారు. మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్, మిడ్జిల్, కోయిలకొండ,, నారాయణపేట జిల్లా లో మద్దూరు, కోస్గి, జోగులంబ గద్వాల జిల్లాలో ధరూరు, అలంపూర్ ఎక్స్ రోడ్, అయిజ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, పాన్ గల్, పెబ్బేరు, ఖిల్లా ఘనపూర్, నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, అమ్రాబాద్, వంగూరు, డీసీసీబీ బ్యాంకు పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, కేశంపేట, కొత్తూరు, కొందుర్గు మొత్తం 20 మండలాలలో డీసీసీబీ అదనపు బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఆర్బీఐ ఆమోదం లభించి బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. అవసరాలను బట్టి ఒక్కొక్కరికి 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే పలువురికి రుణాలను అందజేశారు.

త్వరలోనే ఆన్లైన్ సేవలు..

త్వరలోనే డీసీసీబీ బ్యాంకు ద్వారా ఆన్లైన్ సేవలను అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వీక్ బ్యాంకు నుండి బయటపడి ప్రస్తుతం బి గ్రేడ్ స్థాయిలో ఉన్న బ్యాంకును ఏ గ్రేడ్ కు తీసుకురావడానికి వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గూగుల్ /ఫోన్ పే వంటి ఆన్లైన్ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చి రుణాల పంపిణీ, వసూళ్లు సులభంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 256 కోట్ల రూపాయల రుణాలను ఖాతాదారులకు అందజేశారు. కొన్ని సంవత్సరాలుగా రూ.1000 కోట్లలోపు ఉన్న బిజినెస్ ఇప్పుడు రూ.1500 కోట్లకు చేరింది. వీలైనంత త్వరగా రూ.2000 కోట్ల బిజినెస్ జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్న డిసిసిబి బ్యాంకును మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, బ్యాంకు అధికారులు సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నారు. పంట రుణాలతో పాటు ఇండ్లు, కార్ల కొనుగోలుకు లోన్లు ఇవ్వడంతో పాటు రైతుల పిల్లలు ఉన్నత విద్యకు అవసరమయ్యే లోన్లు ఇవ్వనున్నారు.

బ్యాంకును అగ్రగామిగా నిలుపుతాం : మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

డీసీసీబీ బ్యాంకును రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపికేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. గతంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకొని వాటన్నింటినీ సరి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధించేందుకు కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ కి ప్రతిపాదనలు పంపాం. మరోవైపు ఆన్ లైన్ సేవలకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

Next Story