Chandrababu : జనవరిలో స్విట్జర్లాండ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-20 04:55:56.0  )
Chandrababu : జనవరిలో స్విట్జర్లాండ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) జనవరిలో స్విట్జర్లాండ్(Switzerland )లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్ దావోస్‌(Davos)వేదికగా జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు స్విస్ పర్యటనకు వెలుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం నిన్న దావోస్‌కు పయనమైంది. రాష్ట్రం నుంచి అధికారులు ఏపీ ఈడీబీ సీఈవో సీఎం సాయికాంత్‌ వర్మ, ఏపీఐఐసీ ఎండీ ఎం అభిషిక్త్‌ కిషోర్ దావోస్‌ బయల్దేరి వెళ్లారు. ఏపీ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజ్‌ కూడా ఇవాళ దావోస్ వెళుతున్నారు. ఏపీ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు అధికారుల బృందం ఈ నెల 22 వరకు దావోస్‌లో ఉంటుంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ అధికారుల బృందం ఎంపిక చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై దావోస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో అధికారుల బృందం చర్చిస్తుంది. దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలను ‘షేపింగ్‌ ద ఇంటెలిజెంట్‌ ఏజ్‌’ అన్న థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

గతంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఐదేళ్లలో దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేయడంలో సఫలీకృతమయ్యారు. వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు హాజరయ్యే దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు పెట్టుబడుల సాధనకు మంచి అవకాశమని చంద్రబాబు భావించేవారు. చంద్రబాబు చొరవతో పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారే రాష్ట్రప్రభుత్వ బృందం దావోస్ సదస్సుకు హాజరైంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆ సదస్సులో పాల్గొన్నారు. అప్పుడూ మన దేశానికి చెందిన రెండు మూడు సౌర, పవన విద్యుత్ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకోగలిగారు. ఈ నేపథ్యంలో ఈ దఫా చంద్రబాబు దావోస్ పర్యటనపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed