పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెంపు

by Mahesh |
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెంపు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ అంచనా నిర్ణయాన్ని 35200 కోట్ల రూపాయల నుండి 55 వేల కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగిందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ వెల్లడించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 71 మండలాల 12 లక్షల 30000 ఎకరాలకు సాగునీరు, పారిశ్రామికవాడలకు అవసరమైన నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అవసరాలను బట్టి నాలుగు నుండి 5 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లను నిర్మించేందుకు అధికారులు వెంటనే భూసేకరణ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల వట్టెం, కరివెన రిజర్వాయర్ల పనులు దాదాపు పూర్తికావచ్చాయని, ఉదండాపూర్ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను కూడా పూర్తి చేయాలని శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కాగా ఎత్తిపోతల పథకం పనులకు అన్ని రకాల అనుమతులను తీసుకొని నిర్మాణ పనులు పూర్తి చేసి 60 రోజులు శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఇప్పటివరకు ఉన్న అంచనా వేయాన్ని 55 వేల కోట్లకు పెంచుతామని మంత్రులు సమావేశంలో ప్రస్తావించారు.

ప్రాజెక్టుల పనుల వ్యయంకు సంబంధించి అధికారులు నివేదికలను రూపొందించాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కోయి సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, బీమా, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్లను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ఆస్పత్రుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిస్తే, షాపులు నుండి వచ్చే అద్దెతో ఆసుపత్రి నిర్వహణ భారం ప్రభుత్వానికి తగ్గుతుందన్నారు. అలాగే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రి లేక పేదలకు వైద్యం అందక ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని.. వెంటనే వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని కోరారు. మేఘా రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, వాకిటి శ్రీహరి, రాజేష్ రెడ్డి, పరిణికా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed