బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం.. సింహవాహనంపై మలయప్పస్వామి

by Y.Nagarani |
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం.. సింహవాహనంపై మలయప్పస్వామి
X

దిశ, వెబ్ డెస్క్: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. తిరుమల గిరులు గోవిందా.. గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. రోజుకు రెండు వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతున్న స్వామి వారిని చూసి తన్మయత్వం చెందుతున్నారు. శ్రీనివాసుడిని కన్నులారా వీక్షించి భక్తి పారవశ్యాన్ని పొందుతున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు సింహవాహన సేవ నిర్వహించారు. ఆదివారం ఉదయం మలయప్పస్వామి సింహవాహనంపై ఊరేగుతూ.. భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీనివాసుడిని దర్శించుకున్న అనంతరం.. సింహవాహన సేవను వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. ఈ వైభోగాన్ని కన్నులారా వీక్షిస్తూ.. స్వామివారికి అడుగడుగునా హారతులు పట్టారు. స్వామివారి ముందు సాంస్కృతిక నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.

మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్వామివారికి స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ ముత్యపు పందిరి వాహనసేవ ను నిర్వహించనున్నారు. వారాంతం కావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

Advertisement

Next Story