ఆ ఒక్క విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

by Mahesh |
ఆ ఒక్క విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యేవిధంగా ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం ఉత్సాహాన్ని తెచ్చింది. ఇన్నాళ్లు ఒకింత నిరాశ, నిస్పృహలతో ఉన్న పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెచ్చేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న మార్పులకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టేలా కాంగ్రెస్ శ్రేణులు అడుగులు ముందుకు వేస్తున్నారు.

రూటు మార్చిన భట్టి..

కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగేలా ఇక్కడి నేతలు ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేకించి పీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుధ్ రెడ్డి చేసిన విజ్ఞప్తి, ఒత్తిడితో భట్టి విక్రమార్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలలో పాదయాత్ర సాగే విధంగా రూట్ మ్యాప్ మార్చారు.

పాదయాత్రకు అన్ని తానై ముందుకు సాగించడంలో తన వంతు పాత్రను అనిరుధ్ రెడ్డి పోషిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్, తదితరులు సైతం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు కూడా భట్టి యాత్రను విజయవంతం చేయడానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

బట్టి అనారోగ్య కారణాల వల్ల గత నాలుగు రోజుల నుంచి వాయిదా పడిన పాదయాత్ర మంగళవారం నుంచి పున: ప్రారంభం కానుంది. జడ్చర్లలో భారీ బహిరంగ సభను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా లక్ష మందితో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులంతా కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. జడ్చర్ల పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదాన ప్రాంగణంలో ఈ నెల 25న సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ విందేర్ సింగ్ సుక్కు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు తాక్రే తదితరులు హాజరుకానున్నారు.

పలు మండలాల్లో మారనున్న కమిటీలు

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన మండలాల కమిటీలను మార్చాలని పార్టీ అధిష్టానం జిల్లా కమిటీలను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాదులోని గాంధీభవన్లో జరిగిన సమావేశానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంచార్జ్ తాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పనిచేయని మండలాల కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను ఎంపిక చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సైతం తమకు అనుకూలంగా మలుచుకోవాలని సూచించినట్లు సమాచారం.

చేరికలపై ప్రత్యేక దృష్టి..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలతో పాటు, తటస్తులు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలను పార్టీ లో చేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించారు.

బహిరంగ సభను జయప్రదం చేయండి

జడ్చర్లలో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష మందికి పైగా జనంతో సభను నిర్వహిస్తున్నామని, జడ్చర్ల నియోజకవర్గానికి సమీపంలో ఉన్న అన్ని నియోజకవర్గాల పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story