ఉమ్మడి పాలమూరు జిల్లాకు పర్యాటక శోభ

by Mahesh |
ఉమ్మడి పాలమూరు జిల్లాకు పర్యాటక శోభ
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పర్యాటక శోభను తీసుకురావడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేల సారథ్యంలో యత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ ఏ ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చెందించవచ్చు.. అందుకోసం అవసరమయ్యే ఖర్చు ఎంత.. తదితర వివరాలను సేకరించేందుకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.

అభివృద్ధి జరగని పర్యాటకం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక స్థలాలు చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పిల్లలమర్రి, మయూరి నర్సరీ, అలంపూర్ జోగులాంబ మాత ఆలయం, జూరాల, కోయిల సాగర్, సరళాసాగర్, సోమశిల వంటి ప్రదేశాలు ఉన్నా అవి చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఇవి పర్యాటక స్థలాలుగా గుర్తింపు పొందిన.. సందర్శనకు పర్యాటకులు వచ్చేది తక్కువే.. రాష్ట్రంలోని మిగతా పర్యాటక స్థలాలకు ఉన్న గుర్తింపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న స్థలాలకు లేకపోవడం వల్ల పర్యాటకుల సందర్శన తక్కువే ఉంటుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి తదితరులు ప్రస్తావించిన విషయం పాఠకులకు విదితమే.

రెండు నియోజకవర్గాల్లో పర్యటనలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక స్థలాలను అభివృద్ధి చెందించాలన్న లక్ష్యంతో మంత్రి జూపల్లి సారథ్యంలో, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ముందుగా నల్లమల ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాలు, నిర్మాణాలను అభివృద్ధి చెందించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారు. ఆదివారం దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్ సాగర్, సరళ సాగర్, కురుమూర్తి దేవాలయం వంటి స్థలాలను మంత్రి, ఎమ్మెల్యేలు సందర్శించారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలను మంత్రి జూపల్లి సారధ్యంలో ఎమ్మెల్యేలు అందరూ సందర్శించనున్నారు.

పర్యాటకమైతే అద్భుతాలే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక స్థలాలను అభివృద్ధి పరచడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి పిల్లలమర్రి, మయూరి నర్సరీ, మన్నెంకొండ, కురుమూర్తి, జోగులాంబ మాత ఆలయం, సోమశిల, ఉమామహేశ్వరం, సరళ సాగర్, కోయిల్ సాగర్, తదితర ప్రాంతాలను దశలవారీగా అభివృద్ధి చెందిస్తే ప్రజలకు అన్ని విధాలా మేలు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed