రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది

by Naresh |   ( Updated:2024-03-06 14:30:02.0  )
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది
X

దిశ, అచ్చంపేట: దేశానికి రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మళ్ళీ కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే బీఎస్పీ, బిఆర్ఎస్‌తో కలిసి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సయోధ్య కుదిరిందన్నారు. దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. జన్వాడలో ప్రార్థన మందిరం పై దాడి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు.

ఆ కలయిక బహుజనుల ఆకాంక్ష...

బీఎస్పీ-బీఆర్‌ఎస్‌ పొత్తు బహుజనుల ఆకాంక్ష అని తెలిపిన ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడానికి బీఎస్పీ బీఆర్ఎస్‌తో జతకట్టినట్లు వివరించారు. బహుజనులకు న్యాయం జరగాలనేది పార్టీ లక్ష్యమని ఆయన ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరగబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన బీఆర్ఎస్‌తో బీఎస్పీ కలవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ- బీఆర్‌ఎస్‌ పోటీ చేసే స్థానాల పై త్వరలోనే విధివిధానాలు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రజలు బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో కుంభకోణాల మాయం అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో సీఎం రేవంత్ రెడ్డి రోజుకో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారన్నారన్నారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ గెలవాలనే దృఢ నిశ్చయంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యా, ఉద్యోగాలు, వ్యవసాయ రంగాల్లో నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందని విమర్శించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తారనే విధివిధానాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామన్నారు. అంతకుముందు ఉమామహేశ్వర క్షేత్రం లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యూసఫ్, సుగురు బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story