రాష్ట్ర జాతరగా బావోజీ ఉస్తావాలు : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్...

by Sumithra |
రాష్ట్ర జాతరగా బావోజీ ఉస్తావాలు : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్...
X

దిశ, కొత్తపల్లి : లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామసంద్ (బావొజీ) జాతరను రాష్ట్ర ప్రభుత్వ జాతరగా జరుపుకునేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లాలోని మద్దూర్ మండలం తిమ్మారెడ్డి పల్లిలో నెలకొని ఉన్న లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకామసంద్ మహరాజ్ జాతర సందర్బంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష, స్థానిక శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డితో కలిసి స్వామి లోక మాసంద్, కాళికా మాత దర్శనం చేసుకున్నారు. అనంతరం రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన అతిథి గృహానికి శంఖుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని లంబాడిలకు ఒకరు సేవాలాల్ మహరాజ్ మరొకరు లోకా మసంద్ ఆరాద్యులని అన్నారు. లోకామసంద్ జాతరకు దేశం నలుమూలల నుండి విచ్చేస్తారని తెలిపారు. జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. శాశ్వత ప్రాతిపదికగా తాగునీరు, 50 మరుగుదొడ్లు, ఇతర పారిశుధ్య పనులు సజావుగా నిర్వహించారన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు గిరిజనులకు ప్రలోభాలు పెట్టారు తప్పా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక తమ తాండ తమ రాజ్యం చేస్తూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగిందన్నారు.

గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధికి విద్య, వైద్యం, రాజకీయ గౌరవం కల్పిస్తుందని చెప్పారు. గత సంవత్సరం ప్రారంభోత్సవం చేసుకున్న బ్రిడ్జి , మద్దూర్ నుండి మైసమ్మ వరకు డబుల్ రోడ్డు, అతిథి గృహం పనులు త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. అదేవిధంగా బ్రిడ్జి సమీపంలో ఒక చెక్ డ్యామ్ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పేదలు కల్యాణం చేసుకునే విధంగా ఇక్కడే ఒక స్టేజి తో పాటు షేడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆలయ కమిటీని సూచించారు.

స్థానిక శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం జాతర సమయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సారి తాగు నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ లైట్లు, పారిశుధ్యం తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందన్నారు. తెలంగాణా లంబాడీలు మాత్రమే కాకుండా రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసులోవడం జరిగిందన్నారు. 6 కోట్ల తో శంఖస్థాపన చేసిన బ్రిడ్జి 6 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక గిరిజన నాయకుడు బాల్ సింగ్ మాట్లాడుతూ బావాజీ జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించాలని, అదేవిధంగా ఇక్కడ తండాలకు వస్తున్న రోడ్లను డబుల్ రోడ్ చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు 500 గదుల కాటేజ్ ల నిర్మాణం చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, పాలమూరు యూనివర్సిటీ వి.సి లక్ష్మీకాంత్ రాథోడ్ , మార్కెటింగ్ చైర్మన్ వీరా రెడ్డి, స్థానిక సర్పంచ్ మనెమ్మ, ఎంపీపీ, జడ్పీ టీసీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed