భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు

by Naveena |
భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని,నాణ్యత లోపిస్తే అధికారులపై వేటు వేసేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా, గురుకుల,సింగారం బాలుర వసతి గృహాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి..ప్రతిరోజూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అల్పాహారం, భోజనాన్నివడ్డించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన మాగనూరు జెడ్పీ పాఠశాల మధ్యాహ్నం భోజనం కలుషిత సంఘటన సందర్భంగా..జిల్లా వ్యాప్తంగా పాఠశాల, హాస్టళ్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మధ్యాహ్నం భోజనం నిర్వహణను ప్రతిరోజు అత్యంత బాధ్యతతో కూడిన వ్యవహారంగా భావించి విద్యార్థులకు వండి పెట్టాలన్నారు. మధ్యాహ్నం భోజనం ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని దుమ్ము, ధూళి లేని బియ్యం శుభ్రంగా కడిగి భోజనం వండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కందిపప్పు, కారం, మంచి నూనె ఇతర సామగ్రి నాణ్యత కలిగి ఉండాలన్నారు. కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉండేలా చూడాలన్నారు. పరిశుభ్రమైన వంట గదిలో భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని, సురక్షిత త్రాగునీరు ఏర్పాటు చేసి భోజనానికి ముందు విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కునేలా తగిన సూచనలు చేయాలన్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం,రాత్రి భోజనం నిర్వహణ పై పర్యవేక్షణ చేయాలని సూచించారు. నాణ్యతలేని భోజనాన్ని వడ్డిస్తే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై వేటు వేయడానికి వెనుకాడేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

మాగనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా ఉన్నత అధికారుల సమక్షంలో విచారణ జరుగుతుందని,అందులో భాగంగానే మక్తల్ నియోజకవర్గ ఎంఎల్ఏ వాకిటి శ్రీహరి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ బెన్ షాలుం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో భోజనం ఎలా ఉంటుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కేజీబీవీ పాఠశాలలను అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం, ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, మండల ప్రత్యేక అధికారులు వేర్వేరు బృందాలుగా తనిఖీలు చేపట్టారు.

శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ధన్వాడ మండలం కొండాపూర్ TTWREI సొసైటీ (తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్) పాఠశాల,కళాశాలను సందర్శించి..రాత్రి భోజన నాణ్యతను పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో అల్పాహారం,మధ్యాహ్న,రాత్రి భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. రోజూ ఉపాద్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అల్పాహారం, భోజనాన్ని వడ్డించాలని ఆమె ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి..అక్కడి విద్యార్థులతో భోజన నాణ్యత గురించి అడిగారు. మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అలాగే జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెంషాలం శుక్రవారం రాత్రి మక్తల్ లోని బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి..రాత్రి విద్యార్థులకు కోసం సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. రోజూ నాణ్యతతో కూడిన భోజనాన్ని అందజేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ తో పాటు..ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల కూడా దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారంలో నాణ్యత లోపించకూడదని, భోజనాన్ని ఉపాధ్యాయులు తిని చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed