భూ గొడవల్లో తలదూర్చాలా ? వద్దా ?

by Sumithra |
భూ గొడవల్లో తలదూర్చాలా ? వద్దా ?
X

దిశ, నారాయణపేట క్రైం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్ల భూ తగాదాల కారణంగా దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. చివరకు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ వ్యక్తి మృతికి కారణమైన వారిలో ఒకరు తప్ప మిగిలిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో పాటు ఊట్కూర్ ఎస్సైని మల్టీ జోన్ ఐజి సుధీర్ బాబు సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో ప్రస్తుతం జిల్లాలో పోలీస్ అధికారులు టెన్షన్ మొదలైంది. సివిల్ సంబంధిత ఫిర్యాదులు వస్తే తీసుకోవాలా ? వద్దా ? పొలం గట్ల పంచాయితీలు పోలీస్ స్టేషన్ కు వస్తే ఏం చేయాలో అనే డైలమాలో పడ్డారు. తమ పరిధి కాని వాటి జోలికి వెళ్లి ఉద్యోగానికి ఎసరు పెట్టుకునే కన్నా సైలెంట్ గా ఉండడమే మంచిది అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఏదైనా చిన్న పొర్ల లాంటి ఘటన జరిగితే వెంటనే పై స్థాయి అధికారులకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు ముందడుగు వేయాలనే నిర్ణయానికి జిల్లా పోలీసు అధికారులు వచ్చినట్లు తెలుస్తుంది.

జిల్లాలో 2940 ధరణి దరఖాస్తులు పెండింగ్...

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 2940 ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వచ్చే పరిష్కరిస్తామని కలెక్టరేట్ అధికారులు ఇటీవల సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తో జరిగిన వీసీ లో తెలిపారు. కలెక్టరేట్ లో 1023, ఆర్డీవో స్థాయిలో 316, తహశీల్దార్ల పరిధిలో 1601 ఉన్నాయి. ముఖ్యంగా నారాయణపేట మక్తల్ మరికల్, మద్దూర్ మండలాలలో అధికంగా పెండింగ్ లో ఉన్నందున ఆ మండలాలకు అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయించి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు.

సివిల్ కేసులను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి...

భూ సంబంధిత సమస్యలను, ఆస్తి పంపకాలు ఇతర అంశాలకు సంబంధించి సమస్యలను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, సివిల్ కేసులు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశతో మాట్లాడుతూ తెలిపారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ విషయంలో ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే స్పందించాలని జిల్లా పోలీసులకు ఆదేశించాం. కోర్టు ద్వారా వచ్చే జడ్జిమెంట్ పై పోలీస్ శాఖ తక్షణమే స్పందించాలని చెప్పాం. అలాగే డయల్ 100 ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed