ఖమ్మం వేదికగా నిర్ణయాలకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి

by sudharani |   ( Updated:2023-05-22 06:56:35.0  )
ఖమ్మం వేదికగా నిర్ణయాలకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి
X

దిశ, బ్యూరో మహబూబ్ నగర్: కొల్లాపూర్ రాజకీయాలు.. ఇప్పుడు ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. అధికార పార్టీ నుంచి బహిష్కృతమైన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని తన కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి.. ఏ పార్టీలో చేరాలి.. చేరితే మీరు అందరూ మద్దతు ఇవ్వగలరా.. లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా..!? మీ నిర్ణయం మేరకే నడుచుకుంటాను అంటూ పేర్కొంటున్నారు. దీంతో వారు కూడా మీ నిర్ణయమే మా నిర్ణయం.. మీరు ఏ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న మీ వెంటే వస్తామంటూ అభయమిస్తున్నారు.

దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పార్టీలైన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలలో దేంట్లో చేరాలనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆయన అనుచర వర్గం ఇచ్చిన మనోధైర్యంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఉన్న మరి కొంతమందిని కలుపుకొని అధికార పార్టీని దెబ్బ కొట్టే విధంగా తాము సిద్ధం కావాలని నిర్ణయంతో జూపల్లి కొన్ని నెలల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కన్నా ఎక్కువగా ఖమ్మం జిల్లా వేదికగా నిర్ణయాలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం అధికార పార్టీని దెబ్బ కొట్టాలనే కసితో ఉండడం.. ఇరువురి లక్ష్యం ఒకటే కావడంతో నిర్ణయాలు ఎక్కువగా అక్కడి నుంచి జరుగుతున్నాయి.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి‌లో జరిగిన సమావేశానికి మాత్రమే హాజరు కాగా జూపల్లి కృష్ణారావు ఇప్పటికే పలుమార్లు ఖమ్మం వెళ్లి పొంగులేటితో కలిసి బీజేపీ, కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపడంతో పాటు.. వచ్చే ఎన్నికలలో అధికార పార్టీని గద్దె దించాలనే కసితో ఉండి కలిసి వచ్చే నాయకులతోనూ మాట్లాడుతూ తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను గద్దెదించే సత్తాఉన్న పార్టీలతోనే చేతులు కలపాలని.. లేదంటే ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదిక ద్వారా పోటీ చేసి ఎన్నికల అనంతరం పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలతో జూపల్లి పొంగులేటి అడుగులు ముందుకు వేస్తున్నారు.

మరికొన్ని సమావేశాల అనంతరమే..!

జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయాలు ఇప్పటికిప్పుడు తీసుకోకుండా.. తమతో కలిసి వచ్చే నేతలు అందరిని కలుపుకొని ముందుకు సాగాలనే లక్ష్యంతో ఉన్నారు.. ఇందులో భాగంగా ఇప్పటికే వనపర్తి, ఖమ్మం నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించారు. రానున్న రోజులలో వరంగల్, కరీంనగర్, నల్గొండ తదితర జిల్లాలలోనూ సభలు నిర్వహించడం ద్వారా తమ సత్తా చాటుకుని బలమైన శక్తిగా రూపొందాలని భావిస్తున్నారు.. ఈ క్రమంలో ప్రొఫెసర్ కోదండరాం వంటి వారిని కూడా తమతో కలిసి వచ్చేలా వచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. సంప్రదింపులు, సభలు ముగిసిన తర్వాత ఖమ్మం వేదికగా లక్షలాది మంది జనం మధ్య తమ రాజకీయ భవిష్యత్తును గురించి త్వరలోనే ప్రకటించడానికి జూపల్లి, పొంగులేటి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.. అక్కడ సభలో ప్రకటించిన అనంతరమే కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ భారీ బహిరంగ సభ నిర్వహించే విధంగా జూపల్లి వర్గీయులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జూపల్లి వంటి వనపర్తి బహిష్కృత నేతలు..

జూపల్లి కృష్ణారావు వెంటే తమ రాజకీయ ప్రయాణమన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతులైన ఎంపీపీలు మెగా రెడ్డి, కిచ్చా రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు సైతం సన్నద్ధమవుతున్నారు. వనపర్తిలోను భారీ జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహించి నిర్ణయించుకున్న పార్టీలో చేరేందుకు వనపర్తి ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి సైతం జూపల్లి, పొంగులేటితో పాటు , వారు ఏదైనా రాజకీయ పార్టీని ఎంపిక చేసుకుంటే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలలోను అధికార పార్టీని దెబ్బ కొట్టేలా కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధం కావాలని బహిష్కృత నేతలు భావిస్తున్నారు.

Read More: కాంగ్రెస్ కేడర్‌లో జోష్.. లీడర్లలో పరేషాన్!

Advertisement

Next Story