LRS: అయోమయంలో ఎల్ఆర్ఎస్..! కోర్టు పరిశీలనలో ఉండగా సర్కార్ గైడ్‌లైన్స్ జారీ

by Shiva |
LRS: అయోమయంలో ఎల్ఆర్ఎస్..! కోర్టు పరిశీలనలో ఉండగా సర్కార్ గైడ్‌లైన్స్ జారీ
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్దంగా చేసిన లే అవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు గత సర్కారు ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీంపై అయోమయం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా చేసిన లే అవుట్లకు చట్టబద్దత కల్పించేందుకు అక్రమ లే అవుట్ల రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీం కింద స్వీకరించిన సుమారు 25 లక్షల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలన్న విషయం కోర్టు పరిధిలో ఉండగానే సర్కారు దరఖాస్తులను క్లియర్ చేసేందుకు గైడ్‌లైన్స్‌ను జారీచేసింది. ఇప్పటికే ఎల్‌ఆర్ఎస్ స్కీంకు సంబంధించిన హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో మూడు కేసులు నడుస్తున్నాయి.

దరఖాస్తు సమర్పించే సమయంలో దరఖాస్తుదారుడి నుంచి నామమాత్రంగా ఎల్‌ఆర్ఎస్ చార్జీలను వసూలు చేసుకున్న సర్కారు, ఇప్పుడు మలిదశ చార్జీలను కూడా వసూలు చేసుకుని, ఎల్ఆర్ఎస్ పై కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే క్లియరెన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే ఏళ్లుగడిచిపోవటంతో దరఖాస్తుదారులు సర్కారు సూచించిన వెంటనే మలివిడత చార్జీలు చెల్లించి, కోర్టులో సమస్య పరిష్కారమయ్యే వరకు క్లియరెన్స్ కోసం వేచిచూస్తారా? లేక సర్కారిచ్చిన ఆఫర్‌తో ఎగబడి చార్జీలు చెల్లిస్తారా? వేచిచూడాలి. ఒక్కో దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలించాకే, తుది విడత చార్జీలు వసూలు చేసుకుని, కోర్టు ఇచ్చే తీర్పును అనుసరించి క్లియరెన్స్‌లు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. క్లియరెన్స్ వచ్చేవరకు ఆగి, ఆతర్వాతే తుది విడత చార్జీలు చెల్లిస్తే బాగుంటుందని పలువురు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ‘దిశ’తో చెప్పారు.

సర్కారు మార్గదర్శకాలు..

ఒక్కో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు మూడు రకాలుగా ఆమోదం పొందిన తర్వాతే నాలుగో దశలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తొలుత ఒక్కో దరఖాస్తుకు సంబంధించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఓ ప్రత్యేక సిస్టమ్‌తో దరఖాస్తులను ఐజీఆర్ఎస్, ధరణిల ప్రకారం సర్వే నంబర్ల ప్రకారం ఫిల్టర్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను సర్వే నంబర్, గ్రామాల వారీగా వేర్వేరు చేసుకుని, క్లస్టర్లుగా విభించి, ఒక్కో క్లస్టర్‌కు పత్య్రేకమైన నంబర్లను కేటాయించాలి. క్రయవిక్రయాలు నిషేధించిన సర్వేల్లోని భూములకు సంబంధించి వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆటోమెటిక్ జనరేటెడ్ సిస్టమ్ ద్వారా దరఖాస్తుదారుడికి షార్ట్ ఫాల్ పంపించాలి. షార్ట్ ఫాల్ స్వీకరించిన ప్లాటు యజమానికి ఆ ప్లాటుకు తానే యజమాని అంటూ ధృవీకరించే అదనపు పత్రాలేమైనా ఉంటే సమర్పించుకోవచ్చు. పున:సమర్పించిన దరఖాస్తులను తదుపరి స్క్రూటినీ ఎల్-1 దశకు పంపబడును. క్రయవిక్రయాలు నిషేధించిన సర్వేల్లోని భూములకు సంబంధించి వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మరోసారి రిజిస్ట్రేన్ అండ్ స్టాంప్స్ శాఖకు పంపించాలి. సదరు నిషేధిత సర్వే నంబర్లలో మళ్లీ క్రయవిక్రయాలు జరగకుండా చూడాలి.

లెవెల్-1..

ఈ లెవెల్‌లో ఒక్కో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుపై సంబంధిత శాఖల సిబ్బంది ఫీల్డు ఇన్స్‌పెక్షన్ నిర్వహించనున్నారు. ఫీల్డులో దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న టీమ్‌లలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇరిగేషన్ ఏఈ, సదరు ఫ్లాటున్న స్థానిక సంస్థకు చెందిన టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌లు ఉంటారని సర్కారు గైడ్‌లైన్స్‌లలో పేర్కొంది. ఫ్లాటున్న భూమి వక్ఫ్, దేవాదాయ, ఇనామ్, అసైన్డ్ సీలింగ్, కోర్టు కేసులు, శిఖం, బఫర్ జోన్, వాటర్ బాడి, నాలా, చెరువుల, హెరిటెజ్, డిఫెన్స్‌లకు సంబంధించినదా? కాదా? నిర్థారించాల్సి ఉంటుంది. నాలా, వాటర్ బాడీ, బఫర్, హైటెన్షన్ పరిధిలోకి వస్తున్న భూమిలోని ఫ్లాటుకు సంబంధించిన ఫ్లాటు అయితే వివిధ శాఖలతో నియమించిన బృందాలు విచారించి, దరఖాస్తులను తదుపరి ప్రక్రియకు పంపనున్నాయి. దరఖాస్తులోని వివరాల్లో వాస్తవాలను తేల్చే టీమ్ లిఖితపూర్వకంగా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

లెవెల్-2..

లెవెల్-1లో క్లియరెన్స్ పొందిన దరఖాస్తులను లెవెల్-2కు రానున్నాయి. వీటిని రోడ్డు వెడల్పు, మాస్టర్ ప్లాన్, జోన్ల రెగ్యులరైజేషన్, ఓపెన్ స్పేస్ అనే అంశాల ప్రాతిపదికన దరఖాస్తుల పరిశీలన జరగనుంది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత, టీమ్‌లు అడిగిన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత ఈ దరఖాస్తులను లెవెల్-3కు పంపించనున్నారు. ఈ దరఖాస్తులను సీపీఓ/సీటీఓ/డీపీఓలు స్క్రూటినీ చేయనున్నారు.

లెవెల్ -3..

లెవెల్-1, 2లో క్లియరెన్స్‌లు పొందుతూ వచ్చిన దరఖాస్తులను లెవెల్-3కి పంపనున్నారు. ఇక్కడ వీటిని మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి ఉన్నతాధికారి, లోకల్ బాడి అడిషనల్ కలెక్టర్, జీహెచ్ఎంసీ పరిధిలో జిల్లా, సిటీ ప్లానర్ గానీ, జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్, హెచ్ఎండీఏ ప్లానింగ్‌లు స్క్రూటినీ చేయనున్నారు. తుది క్లియరెన్స్‌ను హెచ్ఎండీఏ గానీ జీహెచ్ఎంసీ గానీ మిగిలిన ప్రాంతాల్లోని ఫ్లాట్ల దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ క్లియరెన్స్ ఇవ్వనున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయటంలో వీరే కీలక పాత్ర పోషించనున్నట్లు సర్కారు మార్గదర్శకాల్లో వెల్లడించింది.

అక్రమ లేవుట్లను సునిశితంగా పరిశీలించాలి.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభరెడ్డి

ఎల్ఆర్ఎస్ స్కీం కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో సగం దరఖాస్తులకు సంబంధించిన లే అవుట్లు హెచ్ఎండీఏ లే అవుట్ల అభివృద్ధి నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని శిఖం, వక్ఫ్, లావణి, బఫర్ జోన్, వాటర్ బాడీ, అటవీ శాఖకు చెందిన భూముల్లో చేసిన లే అవుట్లు కూడా ఉన్నాయి. కేవలం రెవెన్యూ కోసమే కాకుండా సర్కారు ఇలాంటి భూముల్లోని లే అవుట్లను నిశితంగా పరిశీలించి, తుది విడత చార్జీలు వసూలు చేయాలి. ఏమాత్రం తొందరపడినా లే అవుట్ రెగ్యురలైజేషన్ స్కీం అర్థం మారిపోయి, కబ్జాదారులు ఆక్రమించిన భూములకు చట్టబద్దత కల్పించినట్టు అవుతుంది. ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగా, సర్కారు క్లియరెన్స్ కోసం ప్రాసెస్ చేయటం కోర్టు ధిక్కారణ కిందకు రాకపోయినా, మలివిడత చార్జీలు చెల్లించిన తర్వాత మళ్లీ వ్యవహారం కోర్టుకెక్కితే ఎల్ఆర్ఎస్‌కు శాశ్వత పరిష్కారం మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.

Advertisement

Next Story