ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ కంప్లీట్: మంత్రి పొంగులేటి

by Satheesh |
ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ కంప్లీట్: మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నామని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ మీడియా మేనేజ్‌మెంట్‌పై నిర్వహిస్తున్న రెండు వారాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీలంకకు చెందిన మీడియా నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చింది. ఈ బృందం పర్యటనను భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసింది. కాగా ఈ సభ్యులు గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కాగా రాష్ట్రానికి వచ్చిన బృందానికి స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వారితో మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీల రంగంలోనూ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి అంత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ఆయన వివరించారు. పేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను మంత్రి వారికి వివరించారు. జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో వారు పర్యటించిన ప్రదేశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు ఉన్నారు.


Advertisement

Next Story

Most Viewed