స్పీడ్ మీదున్న టీకాంగ్రెస్‌.. అయినా పార్టీలో చేరేందుకు ఆలోచిస్తున్న నేతలు!

by GSrikanth |
స్పీడ్ మీదున్న టీకాంగ్రెస్‌.. అయినా పార్టీలో చేరేందుకు ఆలోచిస్తున్న నేతలు!
X

కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొన్నది. దీంతో తెలంగాణలోనూ పార్టీలో వలసలకు అవకాశం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడంతో ‘కారు’ అసంతృప్తి వాదులంతా ‘చేయి’ అందుకోవాలనుకుంటున్నారు. అయితే టికెట్టుపై స్పష్టత లేకపోవడంతో చేరాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు. అంతేకాకుండా సీనియర్ల నుంచి వస్తున్న కామెంట్లు చేరాలనుకునే నేతలను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. పాత లీడర్లకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ ఓ వైపు వినిపిస్తుండగా, కొత్తగా హస్తం దరికి చేరాలనుకునే వారికి రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఎలాంటి భరోసా కల్పించకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యాయి. గతంతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగింది. ఈ ట్రెండ్‌ను మరింత పెంచుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా చేరికల మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జిల్లాల వారీగా చేరికల కమిటీలను కూడా వేశారు. గతంలో పార్టీని విడిచివెళ్లిపోయిన వారిని ‘ఘర్ వాపసీ’ పేరిట తీసుకురావడమే కాకుండా, ఇతర పార్టీల్లోని అసంతృప్తివాదులను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఓ జాబితాను తయారు చేసుకున్నది. దాని ప్రకారం చేరికల ఆపరేషన్‌ను మొదలు పెడతామని టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు.

ఏం చేద్దాం?

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేరికల నిర్ణయం బాగానే ఉన్నా, పార్టీలోకి నేతలను తీసుకొచ్చేందుకు ఎలాంటి భరోసా ఇవ్వాలనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌లో చేరాలంటే తప్పనిసరిగా టిక్కెట్లు అడిగే ఆస్కారముంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఆహ్వానిస్తున్నదే తప్పా టికెట్లపై నోరు మెదపడం లేదు. హైకమాండ్ న్యాయం చేస్తుందంటూ టీపీసీసీ నేతలు మాట దాటవేస్తున్నారు. దీంతో పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర పార్టీల అసంతృప్తి నేతలు కన్ఫ్యూజన్‌లో మిన్నకుండిపోతున్నారు. చేరికల హామీలపై సరైన స్పష్టతను ఇవ్వకపోవడంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్న నేతలు నెమ్మదిస్తున్నారు. మొదటి నుంచి పనిచేస్తున్న నేతలను, కొత్తగా పార్టీలో చేర్చుకోబోయే లీడర్లను సమన్వయం చేస్తూ భరోసా కల్పించే దిశగా పార్టీ అడుగులు వేస్తే కాంగ్రెస్‌లో మరింత జోష్ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కారు నుంచి చేతి గుర్తుకు..

రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హౌస్ ఫుల్ అయిందని చెప్పవచ్చు. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల టికెట్టు వచ్చే అవకాశం లేని నేతలు సహజంగానే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారు. దీనిలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు చూసే చాన్స్ ఉన్నది. ఇతర పార్టీలతో పోల్చితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడమే దీనికి కారణం. రాబోయే రెండు నెలల తర్వాత వలసలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సదరు నేతలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పాతోళ్లకే టికెట్లు ఇవ్వాలని, కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎలాంటి పదవులు, ప్రయారిటీ ఇవ్వొద్దని ఇప్పటికే పలువురు సీనియర్లు మీడియా సాక్షిగానే ఢిల్లీ హైకమాండ్‌ను కోరారు. ప్రస్తుతానికి ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, సీనియర్లు చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్‌కు మైనస్ అయ్యేలా కనిపిస్తున్నది. ఇలాంటి ప్రకటనలతో కొత్తగా కాంగ్రెస్‌లో చేరాలనుకునే వారు డైలమాలో పడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐసీసీ, టీపీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story