- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వే కలకలం.. శేరిలింగంపల్లిలో గెలిచేది ఆ పార్టీయేనా?
దిశ, శేరిలింగంపల్లి: 'సార్ మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మేడం ఎవరు గెలిస్తే బాగుంటుంది? శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలో ఎవరికి అవకాశం ఉంది?' ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు కొందరు నాయకులు. ఈ మధ్య శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సర్వేల హడావుడి కొనసాగుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుండే ఈ హడావుడి ఏంటన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుందన్నది ఆయా పార్టీల టికెట్ల ఆశావాహుల్లోనూ అయోమయం నెలకొందనే చెప్పాలి.
నాయకుల ముందుచూపు
రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్స్ హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఆ తరహా కోలాహలమే నెలకొంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కాలనీల వారీగా కలియ తిరుగుతూ కమలదళాన్ని కూడగట్టే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో మల్లగుల్లాలు పడుతున్నా ఓ సీనియర్ నాయకుడు శేరిలింగంపల్లిలో తానున్నానంటూ ఈ మధ్య కాలంలో కాస్త ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అతని వెంట నడిచే వారు లేక ఉసూరుమంటున్నారు. ఇక అధికార పార్టీ నాయకుల హడావుడి ఎప్పటిలాగే కొనసాగుతోంది. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంపై గంపెడు ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతలు మాత్రం జనాల నాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జనాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఏ పార్టీలో ఉంటే బాగుటుంది. తామున్న పార్టీలో టికెట్ వస్తుందా లేదా.. పార్టీ మారాల అన్నది తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం సర్వేలనే నమ్ముకున్నారు.
సర్వేలతో తల మునకలు..
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు సర్వేలు చేయించుకోవడం పరిపాటిగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం, ఈ మధ్యకాలంలో చాలా చోట్ల బీజేపీ, టీఆర్ఎస్‌లోకి వలసలు సాగడం ఈ తరహా సర్వేలకు ఊతమిచ్చినట్లు అయింది. ఇప్పుడు ఉన్న పార్టీలో బెటారా, లేదా గోడ దూకాలా? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇలా అనేక అంచనాలు వేసుకుని కొందరు నాయకులు సర్వేలు చేయించుకునేందుకు మొగ్గుచూతున్నట్లు కనిపిస్తోంది. అలాగే మేం స్వతంత్ర సర్వే చేస్తున్నామంటూ ఇంకొందరు ఇంటింటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే ఈ సర్వేలను ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు అనే విషయం పక్కన పెడితే.. ఈ సర్వేలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అన్న సందేహాలు మాత్రం అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే సర్వేలు చేయిస్తున్నారన్న చర్చ సాగుతోంది.
పార్టీల సర్వేలా? పర్సనల్ సర్వేలా?
రాష్ట్రంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఈ సర్వేల హడావుడి జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే సర్వేలు చేయిస్తుంది ఆయా పార్టీల అధిష్టానాల, లేదా నియోజకవర్గ నాయకులా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ పార్టీలు చేయిస్తే కేవలం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు చేయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేయించాలి. కానీ కేవలం ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తుండడం, ఇక్కడే ఇంటింటి సర్వే చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదో ఒక పార్టీకి చెందిన నాయకుడు, లేదా టికెట్ ఆశిస్తున్న వ్యక్తి ఈ సర్వే చేయిస్తున్నారని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.
అభ్యర్థులు వీరేనా..?
తాజాగా నిర్వహిస్తున్న సర్వే ప్రకారం టీఆర్ఎస్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, బండి రమేష్, కొమరగొని వెంకటేష్ గౌడ్ పేర్లను ఉటంకిస్తూ సర్వే చేస్తున్నవారు ప్రశ్నలు అడుగుతుండగా, బీజేపీ నుండి మొవ్వా సత్యనారాయణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మారబోయిన రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, గజ్జల యోగానంద్ పేర్లను తమ ప్రాధాన్యత లిస్ట్‌లో పొందుపరిచారు. ఇండియన్ కాంగ్రెస్ నుండి మన్నె సతీష్, మహిపాల్ యాదవ్, టీడీపీ నుండి వి.ఆనంద్ ప్రసాద్, బీఎస్పీ నుండి వడ్ల నర్సింగ్ ముదిరాజులకు ప్రాధాన్యత ఇస్తూ ఇందులో మీరు ఎవరికి ఓటు వేస్తారని అడుగుతున్నారు. ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అయితే శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి చేశారా..? రవికుమార్ యాదవ్ యూత్ కదా ఆయనకు అవకాశం వస్తే ఎలా ఉంటుంది.
టీడీపీకి ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందా అంటూ పరిపరి విధాలా ప్రశ్నలు వేస్తున్నారు సర్వే చేస్తున్న ప్రతినిధులు. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్న జరిపేటి జైపాల్ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే. అలాగే ఈ మధ్య రాహుల్ జోడో యాత్ర నేపథ్యంలో మరో వ్యక్తి శేరిలింగంపల్లి కాంగ్రెస్ రేసులో తానూ ఉన్నట్టు పోస్టర్లు వేసుకుంటున్నారు. ఆయన పేరు కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో మహిపాల్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. అదీగాక టీఆర్ఎస్, బీజేపీ నుండి కార్పొరేటర్లుగా ఉన్న పలువురికి కూడా ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం ఉంటే మీరు ఎవరికి ఓటేస్తారంటూ ఈ సర్వేలో అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్న ముందే సర్వే రిపోర్టులు రెఢీ చేస్తుండడం దేనికి సంకేతమో అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది.