తెలంగాణలో రేషన్ కార్డు అప్లికేషన్ల పరిశీలన షురూ.. గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్

by Prasad Jukanti |
తెలంగాణలో రేషన్ కార్డు అప్లికేషన్ల పరిశీలన షురూ.. గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరిపాలన, సంక్షేమంపై దూకుడు పెంచాలని భావిస్తున్న రేవంత్ సర్కార్.. కొత్త రేషన్ కార్డు జారీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అర్హులకే కార్డులను జారీ చేసే విషయంలో క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల వడపోత కార్యక్రమాన్ని షురూ చేసింది. పౌరసరఫరాల శాఖ అధికారుల ఆదేశాలతో అర్హులను గుర్తించే పనిని అధికారులు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించగా మిగతా జిల్లాల్లో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో గ్రామాల్లో అర్హులను తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు, ధరణి తదితరాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.

మిషన్ భగీరథపై ఆరా..

మరోవైపు రాష్ట్రంలోని గృహాలకు నల్లా కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ‘మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా? అందులో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? వస్తే.. ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి? నల్లా నీళ్లు మీ అవసరాలకు సరిపోతున్నాయా?’ అనే వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు. మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం ఇంటింటికి నల్లా నీళ్లు సరఫరా చేస్తున్నామని చెప్పినా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులు లేవని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు అందించే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచే ఈ సర్వే మొదలైంది. ఇందుకోసం మిషన్ భగీరథ పేరుతో ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసి సేకరిస్తున్న సమాచారాన్ని అందులో పొందుపరుస్తున్నారు.

వలస వెళ్లినవారిలో ఆందోళన..

రేషన్ కార్డులు, మిషన్ భగీరథ కనెక్షన్లపై అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే మొదలు పెట్టగా ఈ విషయం తెలియని వలస వెళ్లినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాల్లో ఉంటున్న తమకు రేషన్ కార్డుల సర్వే సంగతి తెలియడం లేదని మౌఖిక ఆదేశాలతో చేపట్టిన సర్వేల్లో తమ అప్లికేషన్ వివరాలు సక్రమంగా నమోదు చేయకపోయినా, తమను పరిగణలోకి తీసుకోకపోయినా తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ అవుతున్నందున ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed