మాజీ సైనికులకేది భూమి?

by Seetharam |   ( Updated:2023-06-07 14:49:36.0  )
మాజీ సైనికులకేది భూమి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన బందెల సురేందర్ రెడ్డి సైన్యంలో సేవలు అందించారు. ఉద్యోగ విరమణ తర్వాత మాజీ సైనికుల కోటా కింద ఇచ్చే భూమిని ఇవ్వాలంటూ సైనిక సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లా దొమ్మాట సర్వే నంబర్ 714లో ఐదెకరాలు కేటాయించాలని అప్లై చేశారు. అయితే ప్రభుత్వ భూములు లేవని, కేటాయించలేకపోతున్నట్లు 2021 డిసెంబరు 13న సిద్ధిపేట కలెక్టర్ సమాధానమిచ్చారు. కానీ అనేక రూపాల్లో భూ పంపిణీ మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఆఖరికి ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. మాజీలకు కేటాయించేందుకు భూములు లేవంటూనే 33 జిల్లాల్లో హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ హౌజింగ్ కార్పొరేషన్, వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీ పరిధిలో వేలం వేస్తున్నారు. మరోవైపు లే అవుట్లు చేసి ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదంటూ మాజీ సైనికుడు సురేందర్ మంగళవారం లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు. ఆఖరికి అధికార పార్టీకి కూడా రూ.వందల కోట్ల విలువైన భూమిని కేటాయించింది.

ప్రభుత్వం జీవో నంబర్ 743 (30.4.1963), జీవో 1241(27.10.2008) లతో పాటు జీవో 63(హౌజింగ్)లను ఉల్లంఘిస్తున్నదని, అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తనకు కేటాయించేందుకు లేదంటూనే మరో వైపు లే అవుట్లు వేసి ప్లాట్లు ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు.

అమ్మకాల జోష్
– కేసీఆర్ సొంత జిల్లా సిద్ధిపేటలో సుడా ఆధ్వర్యంలో మిట్టపల్లిలో మోడల్ లే అవుట్ అంటూ 14 ఎకరాల్లో 111 ఓపెన్ ప్లాట్లు చేశారు.
– కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సర్వే నంబర్ 556, 557లో 86 ఎకరాల్లో అంగారిక టౌన్ షిప్ పేరిట 819 ప్లాట్లతో లే అవుట్ వేశారు.
– ఆదిలాబాద్ జిల్లా బట్టి సావర్గంలో 29 ఎకరాల్లో అగ్రజా టౌన్ షిప్.
– ఆసిఫాబాద్​జిల్లా కాగజ్‌నగర్ మండలం బూరేగాంలో అభ్యుదయ టౌన్ షిప్ అంటూ 70 ప్లాట్లు.
– గద్వాల జిల్లాలో అంబర టౌన్ షిప్ పేరిట 190 ప్లాట్లతో లే అవుట్.
– కామారెడ్డి జిల్లా అడ్లూరులో ధరణి టౌన్ షిప్ పేరిట 50 ఎకరాల్లో వెంచర్.
– నిజామాబాద్ జిల్లా మల్లవరంలో 76 ఎకరాల్లో దాత్రి టౌన్ షిప్.
– మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ అమిస్తాపూర్‌లో 84 ఎకరాలతో సాగరిక టౌన్ షిప్, 20 ఎకరాలతో పోతులమడుగు టౌన్ షిప్.
– వికారాబాద్​యాలాల మండలం కూకట్‌లో మనోహర టౌన్ షిప్, గంగారం, అల్లంపల్లి జాయ్ వెంచర్స్ వాళ్లు ఎకరం రూ.కోటి వంతున కొనుగోలు చేశారు.
– మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 55 ఎకరాల్లో హెచ్ఎండీఏ భారీ వెంచర్ వేస్తున్నది.

బీఆర్ఎస్ కు భూములు

మాజీ సైనికులకు ఇచ్చేందుకు ఎక్కడా భూములు లేవంటూనే అధికార పార్టీ మాత్రం 33 జిల్లాల్లో జీవో 168 ప్రకారం పెద్ద ఎత్తున భూములను కేటాయించింది. బంజారాహిల్స్ లో 4,935 గజాలు, కోకాపేటలో 11 ఎకరాల వంతున బీఆర్ఎస్ పొందిందని సురేందర్ ఫిర్యాదు చేశారు.

‌లెక్కలేనన్ని భూములు

తెలంగాణ రాష్ట్ర జీవో 111ను రద్దు చేసింది. దీని పరిధిలోని 84 గ్రామాల్లోనే ప్రభుత్వ భూములు 18,372 ఎకరాలు, అసైన్డ్ భూములు 9,235 ఎకరాలు, సీలింగ్ భూములు 2,660 ఎకరాలు, భూదాన్ భూములు 1,256 ఎకరాలు ఉన్నాయి. గడిచిన 9 ఏండ్లుగా ఉన్న భూములన్నింటినీ అమ్మేస్తూ ఆదాయం పొందుతుంది. కానీ తనలాంటి మాజీ సైనికులకు మాత్రం భూమి లేదని చెప్తుండడం బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక జీవోలు అమలు చేస్తూ ఐదు ఎకరాల అసైన్డ్ ల్యాండ్, 175 గజాల ఓపెన్ ప్లాటు కేటాయించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ జీవోలను తుంగలో తొక్కుతూ మాజీ సైనికులకు ఇవ్వడానికి అసైన్‌మెంట్ భూములు లేవంటూ ఇంకోవైపు ప్రభుత్వమే హైదరాబాద్ చుట్టుపక్కల మరియు 33 జిల్లాల్లో భూములు వేలంపాట వేస్తూ లేఔట్లు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూములు కేటాయించాలంటూ అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమ్ముతున్న భూముల వివరాలు, లే అవుట్లు, బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూముల వివరాలతో లోకాయుక్తాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed