Ponguleti: కేటీఆర్.. నేను మాట్లాడితే నీకెందుకంత భయం?.. పొంగులేటి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
Ponguleti: కేటీఆర్.. నేను మాట్లాడితే నీకెందుకంత భయం?.. పొంగులేటి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాను అదాని కాళ్లు పట్టుకున్నానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కౌంటర్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఎవరి కాళ్లు పట్టుకోడని గతంలో నేను బీఆర్ఎస్ లో చేరే ముందు ఒకేఒక్కసారి మీ వేలాది ప్రజల ముందు తండ్రితో సమానులు అని భావించి కేసీఆర్ (kCR) కాళ్లు పట్టుకున్నాను. అలా కాళ్లు పట్టుకుంటే మీరు, మీ నాయినా, మీ కుటుంబం నాతోపాటు నా లక్షలాది మంది కార్యకర్తలను తడి గుడ్డతో గొంతు కోశారని మండిపడ్డారు. మీరు అలా చేసినందుకు మీ నాయినకు, మీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు కేటీఆర్ గుర్తుతెచ్చుకోవాలన్నారు. గురువారం తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పొంగులేటి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. దీపావళి పాటకులు పేలుతాయని తాను చెబితే గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఆ విషయాలు చెప్పడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే ఎందకంతాలా భయపడుతున్నారని సెటైర్ వేశారు. తానెక్కడా మీరు పేరు, మీ బావ పేరు, మీ నాయనా పేరు చెప్పలేదని, ఏ పార్టీ పేరు అనలేదన్నారు. కానీ నేను మాట్లాడితేనే కేటీఆర్ ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారని అని నిలదీశారు. ఒక వేళ నేను తప్పుచేశానని కేటీఆర్ కు పశ్చాతాపం కలిగితే ముందస్తుగా వెళ్లి పోలీసులకు సరెండర్ కావాలని సూచించారు. కోర్టు ఇచ్చే తీర్పును గౌరవించాలన్నారు. పేదల సొమ్మును ఎలా దోచుకున్నారో మీకు, మీ పార్టీ వారందరికీ తెలుసు కాబట్టే అందరికంటే ముందే ఉలిక్కి పడుతున్నావని దుయ్యబట్టారు. కేటీఆర్ ఏం చేశారో తెలుసు, నేను ఏం చేస్తానో అందరికీ తెలుసు. చట్టప్రకారం ఎప్పుడు ఎక్కడ ఏం జరగాల్లో అది జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదేళ్ల కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించారు:

కేటీఆర్ పాదయాత్రను వ్యక్తిగతంగా నేను, పార్టీ స్వాగతిస్తున్నామని పొంగులేటి చెప్పారు. మీరు గడిచిన పదేళ్లు అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి సామాన్యులను ఎలాగు పట్టించుకోలేదు. కనీసం మనిషిని మనిషిగా చూడని మీకు పదవి పోగానే పేదలు, తోటి నాయకులు గుర్తుకొచ్చినందుకు సంతోషం అన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తారా లేక మోకాళ్ళ యాత్ర చేస్తారో ఆయన నిర్ణయించుకోవాలన్నారు. పాదయాత్రలో గ్రామాల్లోకి వెళ్తే గతంలో మీరు దోచుకున్న లక్షల కోట్లలో నుంచి గ్రామ పంచాయితీలకు రూ. ఒకటి, రెండు కోట్ల రూపాయలు ఇచ్చి శుద్ధి చేసుకోవాలన్నారు. అలా చేస్తేనైనా వచ్చై ఎన్నికల్లో ప్రజలు అవకాశమిస్తారో చూద్ధామన్నారు. పదేళ్లు మీరు చేసిన అరాచకాలు ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసన్నారు. బీఆర్ఎస్ నేతలు పదవి లేకుండా 11 నెలలు కూడా ఉండలేకపోతున్నారని.. కేసీఆర్ సంపాదించిన ఆస్తినంతా రాష్ట్రంలోని పేదలంతా లాక్కున్నారన్నట్లుగా ఆ ఆస్తినంతా మళ్లీ వెనక్కి లాక్కునేందుకు కేటీఆర్ ఎలా తాపత్రయపడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

బావ బావమరుదులు ఏ టైర్ కింద పెట్టుకుంటారు?:

తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం కొలువు దీరి నేటికి సరిగ్గా పదకొండు నెలలు అవుతున్నదని ఇన్ని రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రతిపక్షం గ్రహించకుండా మాట్లాడుతున్నదని పొంగులేటి ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని పేదల రక్తాన్ని దోచుకుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్లలో చూస్తూ ముందుకు వెళ్తున్నదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు దేశచరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో 27 రోజుల్లో రూ.18 వేల కోట్లను రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. రైతురుణమాఫీని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నదని దుయ్యబట్టారు. తల తాకట్టు పెట్టైనా ఈ డిసెంబర్ లోపే మిగతా రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయబోతున్నామని ఆ రోజున కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao) తల ఏ టైర్ కింద పెడతారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములను అక్రమంగా తమ బినామిల పేర్లపై బదిలీ చేసుకుని గడిచిన పదేళ్లు రైతు బంధు నగదును వారి తొత్తులకు అప్పనంగా ఇచ్చారని ఆరోపించారు. ఇది మీ నాయన సంపాదించిన ఆస్తా లేక మీ తాత సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా అని కేటీఆర్ ను నిలదీశారు. త్వరలోనే ప్రతికుటుంబానికి ఓ సార్మ్ కార్డు ఇవ్వబోతున్నామని ఆ స్మార్ట్ కార్డే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కీలకం కాబోతున్నదన్నారు. మీరు పాలించిన పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలన్న కనీస ఇంగిత జ్ఞానం ఉందా అని నిలదీశారు. ధరణి పేరుతో వేలాది ఎకరాల భూములను పింక్ కలర్ షర్టు వేసుకున్నవారు కబ్జాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను సవరిస్తూ 2024 కొత్త రెవెన్యూ చట్టాన్ని కొద్ది రోజుల్లో తీసుకురాబోతున్నామన్నారు. ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.

Advertisement

Next Story