KTR: కేసీఆర్ మీద కోపంతో చరిత్రను చెరిపేస్తుండ్రు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
KTR: కేసీఆర్ మీద కోపంతో చరిత్రను చెరిపేస్తుండ్రు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ (KCR) మీద కోపంతో చరిత్రను చెరిపేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం గెలిచవాడే పరాజితుల చరిత్రను చెరిపేస్తాడని కామెంట్ చేశారు. తమ పదేళ్ల పాలనలో బతుకమ్మ, బోనాల పండుగలకు రాష్ట్ర పండుగలుగా జరుపుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన చరిత్రను ఎలుగెత్తి చాటుకునే ప్రయత్నం చేశామని అన్నారు. తాము పార్టీ నాయకుల పేర్లు పెట్టి ఏ కార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు. తెలంగాణ (Telangana) చరిత్ర శాశ్వతంగా నిలవాలనే ప్రయత్నం చేశామని అన్నారు.

కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల దేవుళ్ల పేర్లు పెట్టామని అన్నారు. కొత్త జిల్లాలకు ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar), కొమురం భీం (Komuram Bheem) పేర్లను పెట్టుకున్నామని పేర్కొన్నారు. సింహాలు తమ గాథ చెప్పుకోకపోతే వేటగాళ్ల పిట్ట కథలే సత్యాలు అవుతాయని కామెంట్ చేశారు. యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేస్తారని.. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోందని ఆక్షేపించారు. కేసీఆర్ (KCR) మీద కోపం, అక్కసుతో చరిత్రను చెరిపేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ (KCR) చేసిన అద్భుతమైన పనులు గురించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నడూ మాట్లాడరని అన్నారు. మూర్తీభవించిన తల్లిలా తెలంగాణ తల్లిని ఉద్యమ సమయంలో రూపొదించారని.. తమ నాయకుడి మీద ఆక్రోశంతో నేడు ఆ తల్లి రూపాన్నే మార్చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed